బ్రహ్మోత్సవాల వేళ.. టీటీడీ తాజా సూచనలు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తబృందాల చెక్కభజనలు, జీయ్యంగార్ల గోష్టి, మంగళవాయిద్యాల మధ్య వాహనసేవ అంగరంగ వైభవంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద నామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని రామ్ భగీచా 2లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ ద్వారా భక్తులకు విస్తృతంగా బ్రహ్మోత్సవాల సమగ్ర సమాచారాన్ని అందజేస్తున్నట్లు టీటీడీ సీపీఆర్వో డాక్టర్ టీ రవి తెలిపారు. మీడియా ప్రతినిధులకు అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, టీవీ, హై స్పీడ్ ఇంటర్నెట్, వైఫై సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు.

తిరుమలలో 2000లో ప్రారంభమైన శ్రీవారిసేవకు భక్తుల నుంచి ఆదరణ లభిస్తోందని రవి చెప్పారు. ఈ 25 సంవత్సరాల్లో దాదాపు 18 లక్షల మంది శ్రీవారి సేవకులు విచ్చేసినట్లు వివరించారు. తిరుమలలో శ్రీవారి సేవ నిరంతర యజ్ఞంగా కొనసాగుతోందని, బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం, క్యూలైన్లు, అన్నప్రసాదం విభాగం సహా టీటీడీలోని వివిధ విభాగాల్లో సుమారు 4,500 మంది శ్రీవారి సేవకులు సేవలందిస్తోన్నారని అన్నారు.
గరుడసేవ రోజున నాలుగు మాడ వీధుల్లో సుమారు 2,000 మంది శ్రీవారి సేవకులు అన్నప్రసాదం, తాగునీటి పంపిణీ వంటి సేవల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సేవకుల విధులను సమన్వయం చేయడానికి 150 మంది గ్రూప్ సూపర్వైజర్లను నియమించామని, వీరు సేవకుల విధులను పర్యవేక్షించడంతో పాటు, భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలను సేకరిస్తారని రవి వివరించారు.
భక్తుల రద్దీ పెరిగి క్యూలైన్లు వెలుపలికి విస్తరించే పరిస్థితుల్లో సేవలను పర్యవేక్షించడానికి అదనంగా 20 మంది గ్రూప్ సూపర్వైజర్లను ప్రత్యేకంగా నియమించినట్లు తెలిపారు. టీటీడీ సోషల్ మీడియా ద్వారా కూడా బ్రహ్మోత్సవాల సమాచారాన్ని భక్తులకు విస్తృతంగా అందిస్తోన్నామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు అధికారిక సమాచారాన్ని అందించడానికి డిజిటల్ ప్లాట్ ఫామ్ లను సమర్థవంతంగా వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.
శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించడంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలని టీ రవి సూచించారు. సోషల్ మీడియా రీల్స్ కు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రీల్స్ చేయవద్దని, భక్తులకు సేవలందించడానికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. తిరుమలలో గతంలో ఉన్న 10 సమాచార కేంద్రాలతో పాటు, అదనంగా మరో పదింటిని ఏర్పాటు చేశామని అన్నారు. తిరుపతిలో ఇప్పుడున్న రెండు కేంద్రాలకు అదనంగా మరో మూడింటిని నెలకొల్పామని చెప్పారు.












Click it and Unblock the Notifications
