తాడిపత్రి గొడవల వెనుక తతంగం మొత్తం నడిపింది పెద్దలే, ఇంత జరిగినా మౌనంగా ఉన్నాము
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తి అయినా ఆ ఎన్నికల వేడి ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఇప్పటికి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఎదురైయ్యింది. తాడిపత్రి గొడవల వెనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని టీడీపీ ఆరోపిస్తున్నది.
అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ తాడిపత్రిలో ఇంత గొడవలు జరగడానికి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కారణం అని ఆరోపించారు. తాడిపత్రిలో టీడీడీ అభ్యర్థి అస్మిత్ రెడ్డి గెలవబోతున్నారని వైసీపీ నాయకులకు భయం మొదలైయ్యిందని, ఇందుకే ఇన్ని గొడవలు చేశారని వెంకట శివుడు యాదవ్ ఆరోపించారు.

ఎన్నికల రోజే పోలింగ్ బూత్ ల్లో టీడీపీ ఏజెంట్ల మీద దాడికి దిగి వారితో పాటు ఓటు వెయ్యడానికి వచ్చిన సామాన్య ప్రజలను వైసీపీ నాయకుల బెదిరించారని వెంకట శివుడు యాదవ్ ఆరోపించారు.ఆ సమయంలో పోలింగ్ బూత్ దగ్గరకు వెళ్లిన టీడీపీ అభ్యర్థి అస్మతిత్ రెడ్డి మీద రాళ్లతో దాడి చేశారని, ఆయన కారు కూడా ధ్వంసం చేశారని వెంకట శివుడు యాదవ్ అన్నారు. ఆ సమయంలో తాడిపత్రిలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తక్కువగా ఉండటంతో ధర్మవరం నుంచి ఆ పార్టీ నాయకులు తాడిపత్రికి వచ్చారని యాదవ్ ఆరోపించారు.
ధర్మవరం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఆయన అనుచరులు 20 వాహనాల్లో తాడిపత్రికి వచ్చి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారని వెంకట శివుడు యాదవ్ ఆరోపించారు. ఇది చాలక రాజంపేట డీఎస్పీ చైతన్యను అక్కడికి పిలిపించారని, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు మొత్తం ధ్వంసం చేసి తరువాత ఆ ఇంటిలో పని చేస్తున్న వారిని చితకబాదేశారని ఆరోపించారు.
తాడిపత్రి గొడవల వెనుక వైసీపీ పెద్దలు ఉన్నారని స్పష్టంగా వెలుగు చూసిందని, దాడులు వాళ్లు చేసి 60 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తల మీద కేసులు పెట్టారని వెంకట శివుడు యాదవ్ ఆరోపించారు. తాడిపత్రిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. ముందు జాగ్రత్త చర్యగా బయట ప్రాంతాల నుంచి తాడిపత్రికి వచ్చి వెలుతున్న వారి గురించి పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications