తగ్గేదేలే!! ఎనీ సెంటర్.. సింగిల్ హ్యాండ్.. చంద్రబాబు!!
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిలో చాలా మార్పు వచ్చింది. గతానికి భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నారు. తన వ్యవహారశైలిని పూర్తిగా మార్చుకున్నారు. మాటల తూటాలు పేలుస్తున్నారు. ప్రత్యర్థులపై ఢీ అంటే ఢీ అంటున్నారు. పూర్తిగా మొహమాటానికి పోయే చంద్రబాబును చూసిన నేతలంతా ఇప్పుడు ఇలా మారిపోవడం, దూకుడుగా రాజకీయం చేయడం చూసి ఆశ్చర్యపోతున్నారు.

రాజకీయాల్లో హుందాగా ఉండాలి
రాజకీయాల్లో హుందాగా ఉండాలి.. ప్రత్యర్థిని ప్రత్యర్థిగానే చూడాలికానీ శత్రువుగా చూడకూడదంటూ ఆయనే స్వయంగా పలు సమావేశాల్లో చెప్పేవారు. ప్రత్యర్థులపై ఒక మాట మాట్లాడేముందు ఆయన అనేక రకాలుగా ఆలోచించేవారు. ఒక్క మాటకే అంత ఆలోచించే బాబు ఇప్పుడు ఏకంగా మాటలతో మంట పుట్టిస్తున్నారంటూ అతిశయోక్తి కాదు. పాతతరానికి చెందిన రాజకీయ నేత అయినప్పటికీ పరిపాలనలో ఎంతో దూరదృష్టితో వ్యవహరించి ఒక విజన్ ను రూపొందించే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు.

మారుతున్న రాజకీయానికి అనుగుణంగా..
2014 ఎన్నికల ప్రచార సభల్లో కూడా వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేయకుండా సాధారణ విమర్శలు చేయడంతోపాటు తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించి చెప్పడంపైనే దృష్టిసారించేవారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇద్దరి మధ్యా ఎప్పడో ఒకసారి మాటలు పేలేవికానీ ఒకరికొకరు మర్యాద ఇచ్చిపుచ్చుకునేవారు. ఇద్దరు గౌరవించుకునేవారు. కానీ మారుతున్న రాజకీయానికి అనుగుణంగా తాను కూడా మారకపోతే పార్టీకి కష్టకాలమని భావించారు.

రెండు నిముషాల్లో మీ కథ తేలుస్తా?
ప్రజలకు పరిపాలన అందించే విషయంలో ఎంత మారినప్పటికీ పార్టీ విషయంలో మాత్రం బాబు మారేవారుకాదు. కానీ ఇప్పుడు ఆయన నోటినుంచి వెలువడుతున్న మాటల తూటాలు ప్రత్యర్థులనే ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నాయి. దమ్ముంటే రా చూసుకుందాం అనే మాట మాట్లాడటానికే పాత చంద్రబాబు ఒకటికి వందసార్లు ఆలోచించేవారు. కానీ ఇప్పుడు పక్కా మాస్ లీడర్ అయిపోయారు. దమ్ముంటే రా చూసుకుందాం.. నెవ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం.. పోలీసులు తమకు సంబంధం లేనట్లుగా కొంచెం సేపు పక్కనుంటే రెండే నిముషాల్లో మీ కథ తేలుస్తా... ఆకు రౌడీలను, వీధి రౌడీలను చాలామందిని చూశాను... బెదిరింపులకు భయపడేదే లేదు.. ఎవరు వస్తారో రండి.. తేల్చుకుందాం.. మగాళ్లైతే రండి.. చంపేస్తారా? భయపడాలా? మా కార్యకర్తలను కొడితే మీ ఇళ్లకు వచ్చి కొడతా... ఇలా మాస్ డైలాగులు వాడుతుండటంతో ప్రజల్లోకి ఎక్కువగా చొచ్చుకెళతాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఈ తరహా డైలాగులు వాడినచోట ప్రజల నుంచి అనూహ్య స్పందన వ్యక్తమవుతుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications