టీడీపీలో ఆళ్ళ నాని చిచ్చు..వైసీపీలోకి కీలక నేత..?
ఆళ్ల నాని అంటే ఏలూరు రాజకీయాలకు ఒక పర్యాయపదం. దశాబ్దాల తరబడి ఆయన ఈ నియోజకవర్గంలో తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మారారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయంగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ఆళ్ల నాని, గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయిన వెంటనే క్రియాశీల రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే కొద్ది రోజుల క్రితమే, ఆయన టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు.
అటు టీడీపీ నాయకత్వం సైతం ఆళ్ల నాని చేరికపై గ్రీన్ సీగ్నల్ ఇచ్చేసింది. ఆళ్ల నాని టీడీపీలో చేరిక వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. అయితే ఆళ్ల నాని చేరికను స్థానిక టీడీపీ నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులను, కార్యకర్తలను ఆళ్ల నాని తీవ్రంగా ఇబ్బంది పెట్టారని, అలాంటి వ్యక్తిని ఎలా చేర్చుకుంటారని టీడీపీ క్యాడర్ పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తోంది. ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ సైతం ఆళ్ల నాని చేరికను వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆళ్ల నాని టీడీపీలో చేరితే కొంతమంది స్థానిక టీడీపీ నేతలు పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆళ్ల నాని టీడీపీలో చేరితే ఏలూరు మాజీ మునిసిపల్ చైర్మన్ ఈశ్వరీ బలరాం పార్టీకి దూరం అవుతారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీలో అధికారంలో ఉన్నపుడు బలరాం, ఈశ్వరి దంపతులు వైసీపీలో కీలకంగా ఉన్నారు. ఎడా చైర్ పర్సన్ గా కూడా పనిచేశారు. రెండవసారి కంటిన్యూ చేయకుండా ఆళ్ళ నాని అడ్డుకున్నారన్న కారణంతో వారు వైసీపీకి గుడ్ బై కొట్టి టీడీపీలో చేరారు.గత ఎన్నికల్లో ఆళ్ళ నాని ఓటమికి బలరాం గట్టిగానే కష్టపడ్డారు.
అలాంటి నేతను తిరిగి పార్టీలో చేర్చుకోవడంపై బలరాం, ఈశ్వరి దంపతులు ఒకింత ఆగ్రహం ఉన్నారని సమాచారం. ఆళ్ల నాని టీడీపీలోకి వస్తే మాత్రం సహకరించేది లేదని చాలా మంది టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇందులో తొలి బోణి మాత్రం ఈశ్వరీ బలరాం దంపతులదే అంటున్నారు. ఏలూరు జిల్లా వైసీపీ రాజకీయాలు చూస్తోన్న కోటగిరి శ్రీధర్‌తో ఈశ్వరీ బలరాంకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ సాన్నిహిత్యం మేరకే ఈశ్వరీ బలరాం దంపతులు వైసీపీలోకి వెళ్తున్నారని అంటున్నారు.ఏది ఏమైనా ఆళ్ల నాని చేరితే మాత్రం ఏలూరు రాజకీయంలో రచ్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications