మరో వివాదంలో ఎమ్మెల్యే కొలికపూడి-సీఎం సీరియస్..!
ఏపీలో కూటమి సర్కార్ ఏర్పాటైన తర్వాత నుంచి అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇవాళ మరో వివాదంలో చిక్కుకున్నారు.
తన నియోజకవర్గంలో ప్రజలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ వారికి అండగా నిలవాల్సిన ఎమ్మెల్యే అయి ఉండి.. ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి ఆయన కారణమయ్యారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఎం చంద్రబాబు కొలికపూడి వివరణ కోరారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలం గోపాలపురం గ్రామంలో భూక్యా రాంబాబు, భూక్యా కృష్ణ అనే అన్నదమ్ములు ఉన్నారు. వీరిలో భూక్యా రాంబాబు టీడీపీ గ్రామ కార్యదర్శి. అయితే తాజాగా పల్లె పండుగలో భాగంగా వీరి ఇంటి సమీపంలో సిమెంట్ రోడ్డు వేశారు. ఈ రోడ్డుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భూక్యా రాంబాబు అన్న భూక్యా కృష్ణ కుటుంబం కంపలు వేసి రాకపోకలు అడ్డుకుంది. దీనిపై తాజాగా భూక్యా రాంబాబు ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే కొలికపూడికి తెలిసింది. దీంతో ఆయన కంచె వేసిన భూక్యా కృష్ణ కుటుంబాన్ని బెదిరించారనే ఆరోపణలు వచ్చాయి.
ఆ తర్వాత భూక్యా కృష్ణ భార్య చంటి పురుగుల మందు తాగేశారు. దీంతో అపస్మారక స్ధితిలోకి వెళ్లిన ఆమెను విజయవాడ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి ఇంట్లోకి దూరి అవమానించి కొట్టారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే కొలికపూడి అనుచరులు మాత్రం రోడ్డుపై కంచె వేయడం సరికాదని ఆయన చెప్పారని వివరణ ఇస్తున్నారు. చివరికి ఈ వివాదం టీడీపీ అధిష్టానం దృష్టికి వెళ్లింది. దీంతో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే కొలికపూడి నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ నేతల్ని అదేశించారు. వివరణ వచ్చాక తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
అమరావతి రాజధాని ఉద్యమనేత కొలికపూడి శ్రీనివాస్ కు టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దీంతో తిరువూరులో ఆయన కూటమి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే గెలిచిన తర్వాత నుంచి కొలికపూడి వరుస వివాదాల్లో చిక్కుకున్నారు. వీటిలో చాలా మటుకు నియోజకవర్గంలో సొంతపార్టీ నాయకులు, ఇతర పార్టీల నాయకులతో, జర్నలిస్టులతో అనుచిత వ్యాఖ్యలు చేసినవే ఉన్నాయి. దీంతో పార్టీ అధిష్టానం గతంలోనే పిలిచి మందలించింది. దీంతో ఆయన క్షమాపణలు చెప్పి మరోసారి ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పారు. అయినా ఆయన తీరు మారలేదని తాజా ఘటన నిరూపించింది.












Click it and Unblock the Notifications