కాబోయే సీఎం లోకేష్ ? మళ్లీ తేనెతుట్టె కదిపిన టీడీపీ ఎమ్మెల్యే..!
ఏపీలో మంత్రి నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు గతంలో ఓసారి సీఎం చంద్రబాబును డిమాండ్లు చేయడం ప్రారంభించారు. ఎవరో ఒకరు మొదలుపెట్టిన ఈ డిమాండ్ ను ఆ తర్వాత మిగతా వాళ్లు కూడా అందుకుని ఏకంగా దావోస్ వెళ్లినప్పుడు సీఎం చంద్రబాబు ముందే మంత్రి టీజీ భరత్ వంటి వారు దీన్ని ప్రస్తావించడం వరకూ వచ్చేసింది. దీంతో టీడీపీ మిత్రపక్షం జనసేన సోషల్ మీడియాలో అటాక్ కు దిగింది. చేసేది లేక టీడీపీ వెనక్కి తగ్గింది.
లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ ఎవరూ డిమాండ్ చేయవద్దంటూ పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో జనసేన కూడా వెనక్కి తగ్గింది. అయితే ఈసారి లోకేష్ ను సీఎం చేయాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది. కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటూ ఓ టీడీపీ ఎమ్మెల్యే ఏకంగా ఆయన ముందే హంగామా మొదలుపెట్టేశారు. నిన్న ప్రకాశం జిల్లా కనిగిరిలో రిలయన్స్ సీబీజీ ప్లాంట్ శంఖుస్థాపనకు లోకేష్ వెళ్లిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభ దీనికి వేదికైంది.

ఈ రోజు తమ ప్రాంతానికి వచ్చింది కనిగిరి ముఖ్యమంత్రి నారా లోకేష్ అని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి సభకు హాజరైన వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మన కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్.. అవునా కాదా అంటూ సభకు హాజరైన వారిని ఆయన అడిగారు. దీంతో వారు కూడా కాబోయే ముఖ్యమంత్రి అంటూ నినాదాలు చేశారు. ఇదంతా చూస్తూ లోకేష్ కూడా ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి తన ప్రసంగం కొనసాగించారు.
గతంలో ఓసారి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ ను టీడీపీ నాయకులు తెరపైకి తీసుకురాగానే మిత్రపక్షం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలనే డిమాండ్ ను ఆ పార్టీ నేతలు తెరపైకి తెచ్చారు. దీంతో ఈ వ్యవహారం ఎక్కడికో వెళ్లేలా ఉందని గ్రహించిన టీడీపీ అధిష్టానం వారి నాయకుల దూకుడుకు కళ్లెం వేసింది. ఆ తర్వాత జనసేన సైతం పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ సీఎం డిమాండ్ చేయొద్దంటూ, ఏదైనా ఉంటే కూటమి భేటీల్లో మాట్లాడుకుంటామని సంకేతాలు పంపింది. దీంతో ఇరు పార్టీల నాయకులు సైలెంట్ అయ్యారు.












Click it and Unblock the Notifications