టీడీపీ రాజ్యసభ అభ్యర్దుల ఆస్తులు, అప్పుల లెక్కలు - ఆయనకు సొంత ఇల్లు లేదు..!!
టీడీపీ నుంచి ముగ్గురు అభ్యర్ధులు రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేసారు. సుదీర్ఘ కసరత్తు... సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకొని వీరిని ఎంపిక చేసారు. ఈ ముగ్గురు నామినేషన్లు దాఖలు చేయటంతో.. ఎంపిక ఏకగ్రీవం కానుంది. జనసేన నుంచి లింగమేనని రమేశ్ రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి నామినేషన్లు దాఖలు చేసిన ముగ్గురి ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో సమర్పించారు. వీరిలో బాష్యం రామకృష్ణ కోటీశ్వరుడిగా నిలిచారు. మిగిలిన వారి ఆస్తుల లెక్కలు ఆసక్తి కరంగా మారాయి.
టీడీపీ నుంచి రాజ్యసభ బరిలో నిలిచిన అభ్యర్ధుల ఆస్తులు.. అప్పుల లెక్కలు అఫిడవిట్ లో సమర్పించారు. ముగ్గురు అభ్యర్థులు.. భాష్యం రామకృష్ణ, సానా సతీష్‌బాబు, చింతకాయల విజయ్ తమ ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను అధికారికంగా వెల్లడించారు. వీరిలో భాష్యం రామకృష్ణ అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. ఈయన కుటుంబ మొత్తం ఆస్తుల విలువ అక్షరాలా రూ.672.61 కోట్లు. ఇందులో అత్యధికంగా రూ.502.64 కోట్ల విలువైన స్థిరాస్తులు, వ్యవసాయ, వాణిజ్య, నివాస భవనాలు ఉండగా, కేవలం రామకృష్ణ ఒక్కరి పేరిటే రూ.454.95 కోట్ల ఆస్తులు కేంద్రీకృతమై ఉన్నాయి. వీరి కుటుంబ చరాస్తుల విలువ రూ.169.97 కోట్లు కాగా, అందులో వాహనాల విలువే రూ.18.37 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులోనూ మెజారిటీ వాటాగా ఆయన కుమారుడు సాకేత్ రామ్ పేరిట రూ.18.14 కోట్ల విలువైన లగ్జరీ వాహనాలు ఉన్నాయి. రామకృష్ణ వద్ద రూ.2.20 కోట్ల విలువైన బంగారం, వెండితో పాటు 25 క్యారెట్ల ఖరీదైన వజ్రాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణలో భాగంగా వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఈ కుటుంబం రూ.200.65 కోట్ల మేర రుణాలు తీసుకుంది.

కోట్ల ఆస్తులు.. సొంతిల్లు లేదు
కాగా, ఈయనపై హైదరాబాద్‌లో ఒక పాత వాహన ప్రమాదం కేసు మినహా ఇతర కేసులు లేవు. ఇక.. మరో అభ్యర్ధి సానా సతీష్ బాబు దంపతులకు రూ.27.80 కోట్ల మేర భారీగా చరాస్తులు ఉన్నాయి. కియా ఈవీ 6, ఫార్చూనర్, మెర్సిడెజ్ బెంజ్, ఇన్నోవా హైక్రాస్ వంటి విలాసవంతమైన వాహనాలు ఈ కుటుంబ గ్యారేజీలో ఉన్నాయి. దంపతులిద్దరి వద్ద కలిపి దాదాపు రూ.4.62 కోట్ల విలువైన 3,235 గ్రాముల బంగారం ఉంది. గత నాలుగేళ్లలోనే వీరి వార్షిక ఆదాయం రూ.6,170 (2020-21) నుంచి ఏకంగా రూ. 2.16 కోట్లకు (2024-25) పెరిగింది. అయితే.. వీరికి సొంత ఇల్లు లేదు. చింతకాయల విజయ్ కుటుంబానికి రూ.38 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయి. ఇందులో రూ.7.06 కోట్ల చరాస్తులు ఉండగా, దాదాపు రూ.31.58 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఈ కుటుంబానికి రూ. 16.91 కోట్ల అప్పులు ఉండగా, అందులో భార్య పేరిటే రూ. 13.94 కోట్లు ఉన్నాయి.












Click it and Unblock the Notifications