ఆ వ్యాఖ్యలతో టీడీపీకి చిక్కిన కొడాలి నాని.. వదిలిపెట్టట్లేదుగా!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఎన్నికల్లో పోటీపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా టిడిపి కొడాలి నానిని టార్గెట్ చేస్తుంది. ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఎన్నికల్లో పోటీచేసే అవకాశంలేదని, ఒకవేళ కొడాలి నాని ఎన్నికలలో పోటీ చేస్తున్న గెలిచే అవకాశం లేదని టిడిపి సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తుంది.
కొడాలి నాని పనైపోయిందని, అందుకే కొడాలి నాని 2029 ఎన్నికలలో పోటీ చేయనని వ్యాఖ్యలు చేశారని చర్చ జరుగుతుంది. ఇటీవల మాజీ మంత్రి కొడాలి నాని ఎన్నికలలో పోటీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికలు తనకు చివరి ఎన్నికలని, ఆ తర్వాత ఎన్నికలలో పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు. 2029 ఎన్నికలకు తాను పోటీ చేసేది లేదని కొడాలి నాని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

వైసీపీలో కీలకంగా వ్యవహరించిన కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గుడివాడ నుండి ఎమ్మెల్యేగా గెలిచి, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఈసారి గుడివాడ టికెట్ కొడాలి నానికి కాకుండా, మండలి హనుమంతరావుకు ఇస్తారని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతున్న వేళ, కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజలలోను ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ప్రస్తుతం తన వయసు 53 సంవత్సరాలని, 2029 కి మరో ఐదు సంవత్సరాలు కలిస్తే తన వయసు 58 ఏళ్లు అవుతుందని ఆ వయసులో మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయలేనని కొడాలి నాని ప్రకటించారు. ఇక తన కుటుంబం నుండి ఎవరూ రాజకీయాల్లోకి రారని స్పష్టం చేసిన ఆయన, తన కుమార్తెలు ఎవరికి రాజకీయాల పట్ల ఆసక్తి లేదని వెల్లడించారు.
ఒకవేళ ఆసక్తి ఉంటే తన తమ్ముడి కుమారుడు రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దీంతో కొడాలి నాని రాజకీయ వారసుడు ఆయన తమ్ముడి కుమారుడేనని ఆయన సన్నిహిత వర్గాలలో చర్చ జరుగుతుంది. కొడాలి నాని పనైపోయింది ఓటమిని ముందే ఒప్పుకున్నాడు అంటూ టిడిపి సోషల్ మీడియాలో రచ్చ కొనసాగుతుంది.
గుడివాడలో గెలిపించినప్పటికి ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం టార్గెట్ అవుతున్నాయి. ఏది ఏమైనా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కొడాలి నాని తను చేసిన వ్యాఖ్యలతో ప్రత్యర్థి పార్టీలకు ఆయుధం అందించినట్లు అయింది.












Click it and Unblock the Notifications