సిఎంగానే చెప్పా, కేబినెట్ ఆమోదం అక్కర్లేదు: కిరణ్
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ ప్రాంతంలో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడుతుందని, సిఎంగానే తాను విభజన అంశంపై జివోఎం ఎదుట మాట్లాడానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. విభజన జరిగితే వచ్చే సమస్యల పైన తాను మంత్రుల బృందానికి (జివోఎం) నివేదించానని ఆయన న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోమవారం చెప్పారు. తెలంగాణ వినియోగిస్తున్న విద్యుత్‌లో యాభై శాతం మాత్రమే ఆ ప్రాంతంలో ఉత్పత్తి అవుతుందని, మిగతా యాభై శాతం సీమాంధ్ర నుండి వస్తుందన్నారు.
తెలంగాణలో ప్రాజెక్టులు ఎక్కువగా లిఫ్టి ఇరిగేషన్ పద్దతిలో ఉన్నాయన్నారు. వాటికి పవర్ కావాలంటే మరో ఏడువేల మెగావాట్లు కావాల్సి ఉంటుందన్నారు. విభజన జరిగితే తెలంగాణ 175 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను అదనంగా ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని, అందుకోసం రూ.40వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు.

ఉన్నత విద్యారంగం అంతా హైదరాబాదులోనే కేంద్రీకృతమై ఉందన్నారు. సీమాంధ్ర నుండి 25 శాతం మంది విద్యార్థులు చదువుకునేందుకు హైదరాబాదుకు వస్తున్నారని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందన్నారు. విభజన జరిగితే ఉద్యోగులు సీనియారిటీ కోల్పోతారన్నారు. ప్రయివేటు, ఐటి ఉద్యోగాలు హైదరాబాదులోనే ఉన్నాయని చెప్పారు.
ఉన్నత విద్య విషయంలో హైదరాబాదులో పెద్ద ఎత్తున అభివతృద్ధి జరిగిందన్నారు. 56 ఏళ్లలో విద్యారంగంలో తెలంగాణ పట్ల వ్యత్యాసం చూపలేదన్నారు. ఒక సమస్యకు పరిష్కారం చూపించే దిశలో రెట్టింపు సమస్యలు తీసుకు రావొద్దన్నారు. జోనల్ విధానంలో ఉన్న రెండు లక్షల మంది ఉద్యోగులకు విభజన పెద్ద సమస్య అవుతుందన్నారు.
తెలంగాణలో అరవయ్యేళ్ల క్రితం 6,800 పాఠశాలలు ఉంటే ఇప్పుడు 38,458 ఉన్నాయన్నారు. విద్యారంగంలో ఆంధ్ర 148 శాతం, రాయలసీమ 206 శాతం, తెలంగాణ 460 శాతం అభివృద్ధి చెందిందన్నారు. కలిసిమెలిసి ఉన్న హైదరాబాదులో విభజన ద్వారా మరింత ఉద్రిక్తతలు తలెత్తే అవకాశముందన్నారు.
ముఖ్యమంత్రిగా పిలిచింది
తెలంగాణలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. తనను జివోఎం ముఖ్యమంత్రిగా పిలిచిందని, తాను అలాగే వచ్చి సమైక్యత ఆవశ్యకతను వివరించానని, కేబినెట్ ఆమోదం అక్కర్లేదని చెప్పారు. తాను సిఎంగా ఉన్న మూడేళ్లలో అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేశానని చెప్పారు. విభజన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరినట్లు చెప్పారు. తెలంగాణ డ్రాఫ్ట్ వచ్చినా రాకున్నా డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయన్నారు.












Click it and Unblock the Notifications