Nutan Naidu: కాంగ్రెస్ లో చేరిన బిగ్ బాస్ ఫేం నూతన్ నాయుడు..!
ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితితో సంబంధం లేకుండా చేరికలు మాత్రం కొనసాగుతున్నాయి. గత ఎన్నికలకు ముందు పీసీసీ ఛీఫ్ గా వైఎస్ షర్మిలకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ.. తమ పరిస్ధితి మారుతుందని భావించింది. కానీ కూటమి హవాలో వైసీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో పార్టీలో విభేదాలు కూడా బయటపడ్డాయి. అయినా పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఫేం నూతన్ నాయుడు ఇవాళ పార్టీలో చేరారు.
బిగ్ బాస్ రెండో సీజన్ కు ఎంపికైన నూతన్ నాయుడు.. అప్పట్లో బాగా పాపులర్ అయ్యారు. అప్పట్లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో మెతక మనిషిలాగ అనిపించిన నూతన్ నాయుడు.. సామ్రాట్, తనీష్ వంటి వారితో గొడవపడి బాగా పాపులర్ అయ్యారు. కానీ చివరి వరకూ కొనసాగలేకపోయారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్ 2 సినిమాలోనూ నూతన్ నటించారు. కానీ ఆ తర్వాత మాత్రం సినిమా అవకాశాలు రాలేదు. 2009లో ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఓడిపోయారు.

విశాఖలో దళిత యువకుడికి గుండు కొట్టించిన వ్యవహారంలో చిక్కుకున్న నూతన్ నాయుడు.. ఆ తర్వాత ఎలాగోలా బయటపడ్డారు. ఆ తర్వాత జనసేనలో చేరేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. కానీ ఫలించలేదు. ఇవాళ ఆయన వైఎస్ షర్మిల సమక్షంలో నూతన్ నాయుడు కాంగ్రెస్ లో చేరడం విశేషం. ఆయన సేవల్ని ఎలా వినియోగించుకోవాలన్న దానిపై షర్మిల త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశముంది.












Click it and Unblock the Notifications