న్యాయమూర్తులపై అనుచిత పోస్టులు - ఇద్దరు న్యాయవాదుల సహా ముగ్గురి అరెస్ట్..!!
న్యాయమూర్తులపైన అనుచిత వ్యాఖ్యలు..పోస్టుల కేసులో సీబీఐ దర్యాప్తు మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ పలువురిని అరెస్ట్ చేసింది. దీనికి మూలాల పైన ఆరా తీస్తోంది. ఇదే సమయంలో తాజాగా ముగ్గురిని అరెస్ట్ చేసి..కోర్టులో హాజరు పర్చింది. అందులో ఇద్దరు న్యాయవాదులు ఉన్నారు. చంద్రశేఖర్, గోపాలకృష్ణతో పాటు మరో వ్యక్తిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో ముగ్గురిని అధికారులు విచారించారు. ముగ్గురు నిందితులను హైదరాబాద్ నుంచి గుంటూరు కు సీబీఐ అధికారులు తరలించారు.

సీబీఐ విచారణ వేగవంతం
అనంతరం నిందితులను న్యాయమూర్తి వద్ద పోలీసులు హజరుపరిచారు. జడ్జీలపై కొన్ని పోస్టులకు సంబంధించిన మూలాల ఆధారంగా వెతుకుతూ పోయినప్పుడు.. డిజిటల్ కార్పొరేషన్ లో డొంక కదిలినట్లు తెలుస్తోంది. జడ్జీలపై పోస్టులను అక్కడే తయారుచేయించి, అక్కడి నుంచే సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లుగా అనుమానిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అరెస్టు చేసిన నిందితుల నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా దర్యాప్తు వేగం పెంచింది. ఏడుగురి పాత్రపై కీలక ఆధారాలు లభించడంతో వారు పెట్టిన పోస్టులు డిలీట్ చేస్తున్నట్లు పసిగట్టింది.

ఇద్దరు న్యాయవాదులు సహా
తాడేపల్లిలోని ఉండవల్లి సెంటరు లో గల పోలకంపాడులో నివాసం ఉంటున్న మెట్టా చంద్రశేఖర్‌ను 18వ నిందితుడిగా, గోపాలకృష్ణ 19వ నిందితుడిగా, గుంటా రమేశ్‌కుమార్ 20వ నిందితు డిగా పేర్కొన్నారు. నిందితులను 14రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కోర్టు పీపీ చెన్నకేశవులు వాదనలు వినిపించారు. అయితే, ఈ కేసును సుమోటోగా తీసుకొని హైకోర్టు విచారిస్తున్న సమయంలో మెట్ట చంద్రశేఖర్.. గోపాలకృష్ణ కళానిధి హైకోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేసారు. భవిష్యత్తులో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయబోమని అందులో పేర్కొన్నారు.

ఒకేసారి కస్టడీకి కోరుతూ
వారిద్దరిపైన ఉన్న కోర్టు ధిక్కరణ కేసును న్యాయస్థానం మూసివేసింది. అయితే, అసలు ఈ మొత్తం కుట్రలో వాస్తవాలను నిందితులు వెల్లడించలేదని సీబీఐ పేర్కొంది. ఈ కుట్రను వెలుగులోకి తేవాలంటే వారిని కస్టడీకి తీసుకొని విచారించాలని పేర్కొంది. వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు.. ప్రభావితం చేసిన వ్యక్తులెవరు తదితర అంశాల పైన సమాచారం రాబట్టాల్సి ఉందని..అందు కోసం ఈ ముగ్గురినీ ఒకే సారి కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీనికి ముందు వారి అరెస్టుకు కారణాలను వివరిస్తూ మూడు వేర్వేరు రిమాండ్ రిపోర్టులను న్యాయమూర్తి ఎదుట ఉంచారు.












Click it and Unblock the Notifications