ఒకే బొకే ఎన్నిసార్లు తిప్పుతార్రా అయ్యా
Chandrababu Naidu: రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ గన్నవరం సమీపంలోని కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద ఏర్పాటైన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్.. ఆయనతో ప్రమాణం చేయించారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతోండటం విభజనాంధ్ర ప్రదేశ్‌లో ఇది రెండోసారి. మొత్తంగా నాలుగోసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు, రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా 2014లో ప్రమాణ స్వీకారం చేశారాయన. ఇప్పుడు మళ్లీ ఈ పదవిని అందుకున్నారు.

తొలుత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పవన్ కల్యాణ్, నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు.. ఇలా వరుసగా 24 మంత్రులు ప్రమాణం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మహాజరయ్యారు. ఇప్పటికే బాధ్యతలు స్వీకరించిన కేంద్రమంత్రులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇందులో పాల్గొనడానికి అమిత్ షా, జేపీ నడ్డా మంగళవారం రాత్రే విజయవాడకు చేరుకున్న విషయం తెలిసిందే. వారితో పాటు జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ సైతం ఏపీకి వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో నారా లోకేష్, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు, రాజమండ్రి లోక్‌సభ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వారికి స్వాగతం పలికారు.
అనంతరం తమకు బస కల్పించిన హోటల్ వద్ద అమిత్ షా, జేపీ నడ్డాలను స్వయానా చంద్రబాబు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చంద్రబాబుపై సెటైర్లు సంధించడానికి కారణమైంది.
చంద్రబాబు తనను రిసీవ్ చేసుకునే సమయంలో ఆయనకు బొకే ఇచ్చారు అమిత్ షా. నవ్వుతూ దాన్ని స్వీకరించారు. ఆ బొకేను మళ్లీ వెనక్కి తీసేసుకున్నారు అమిత్ షా. తన సెక్యూరిటీ సిబ్బంది చేతికి దాన్ని ఇచ్చారు. ఆయన వెనుకే ఉన్న జేపీ నడ్డా బొకేను తీసుకుని రాలేదు. అప్పటికే షేక్ హ్యాండ్‌తో స్వాగతం పలికారు చంద్రబాబు జేపీ నడ్డాను.
ఆ కొద్దిసేపటికి చంద్రబాబుకు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్న బొకేను జేపీ నడ్డా చంద్రబాబుకు ఇచ్చారు. దాన్ని అమిత్ తన సెక్యూరిటీ సిబ్బందికి ఇవ్వగా.. వారి దగ్గరి నుంచి దాన్ని తీసుకుని చంద్రబాబు చేతిలో పెట్టారు జేపీ నడ్డా. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. సెటైర్లను సంధించింది.












Click it and Unblock the Notifications