2024లో చంద్రబాబు బలమైన కోరిక ఇదే!!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో కోటి ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకటం ఆనవాయితీ అని పేర్కొన్నారు. గతించిన కాలం దుర్భరంగా ఉన్నప్పుడు ఆ చేదు జ్ఞాపకాలు త్వరగా మరిచిపోవాలని, అలాంటి రోజులు మళ్లీ వెంటాడకుండా జాగ్రత్త పడాలని మంచి రోజుల కోసం మంచి నిర్ణయాలు తీసుకోవాలని నూతన సంవత్సర ఆరంభంలో సంకల్పిస్తామన్నారు.
నాలుగున్నరేళ్ళ నరకాన్ని 2023 లో ప్రత్యక్షంగా అనుభవించామని, భరించామని పేర్కొన్న చంద్రబాబు అర్హతలేని వారిని అందలం ఎక్కిస్తే జరిగిన నష్టాన్ని మనమందరం కళ్లారా చూసామంటూ తెలిపారు. అందుకే ఒక కొత్త ఆశతో, కొత్త సంకల్పంతో, కొత్త విశ్వాసంతో, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదామని పేర్కొన్న చంద్రబాబు నూతన సంవత్సరంలో హింసకు, అవినీతికి, అశాంతికి, అక్రమాలకు, అమానుషానికి తావులేని ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి పటిష్టమైన పునాదులు వేద్దామని ప్రతిన బూనుదామని పిలుపునిచ్చారు.

శతాధిక తప్పిదాల శిశుపాలుడుని 2024లో ఓటు అనే సుదర్శన చక్రం ప్రయోగించి సాగనంపేందుకు తెలుగు సోదర సోదరీమణులు సిద్ధం కండి అంటూ చంద్రబాబు తన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి తెలుగు వాడిని నిపుణత గల విశ్వ మానవుడిగా తీర్చిదిద్దే బృహత్కార్యానికి నాంది పలుకుదాం అని, విశ్వ విను వీధుల్లో తెలుగుజాతి జయపతాక రెపరెపలాడిద్దామని చంద్రబాబు ఆకాంక్షించారు. భరత జాతి సమృద్ధికి మన వంతు చేయూతనిద్దాం అన్నారు.
సంక్షేమం, అభివృద్ధి అనే రెండు చక్రాల పైన సాగే సుపరిపాలన కోసం, పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం మనం సమగ్ర పథక రచన చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసన్నారు. ఇందులో భాగంగా 6 గ్యారంటీ లతో తొలి విడత మేనిఫెస్టో విడుదల చేశామని తెలిపారు. మలి విడతగా తెలుగుదేశం జనసేన కలిసి రాష్ట్ర దశ, దిశ మార్చివేసే సమగ్ర మేనిఫెస్టోను త్వరలోనే ప్రకటించబోతున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
నూతన సంవత్సరంలో మరో నూరు రోజుల్లో ఆటవిక పాలన నుండి తెలుగు ప్రజలకు విముక్తి కల్పిస్తానని హామీ ఇస్తున్నానన్నారు. తెలుగు జాతిని, తెలుగు ఖ్యాతిని ఏ శక్తి అడ్డుకోకుండా చూసే పూచి నాదని పేర్కొన్న చంద్రబాబు, పేదరికానికి, అసమానతలకు తావులేని నవ శకానికి నాంది పలుకుదాం రండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నూతన సంవత్సరం మనందరి జీవితంలో కొత్త వెలుగులు, సిరిసంపదలు, శాంతిభద్రతలు, ఆయురారోగ్యాలు నింపాలని మనసారా కోరుకుంటున్నానని చంద్రబాబు ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications