ఆ మూడు హామీలిస్తే జగన్ విజయాన్ని ఎవరూ ఆపలేరా..?
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార వైసీపీని ఢీ కొట్టడానికి మిగిలిన అన్ని పార్టీలు ఏకం అవుతున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. టీడీపీ,జనసేన పార్టీలతో బీజేపీ జతకట్టగా , కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల అన్న ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతుంది. దీంతో ఏపీలో రాజకీయ పార్టీలన్నీ కూడా జగన్ టార్గెట్‌గా పని చేస్తున్నాయి. మరోవైపు ఎంతమంది కలిసి వచ్చినా గెలుపు తమదే అని వైసీపీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు మంచి చేశాము కాబట్టే తమకు ఓటు వేయమని ప్రజలను కోరుతున్నామని జగన్ చెబుతున్నారు.
మెజారిటీ హామీలను అమలు చేశాము కాబట్టే తమ పార్టీకే ఓట్లు పడతాయని వైసీపీ భావిస్తోంది. వాస్తవ పరిస్థితిని ఓసారి పరిశీలిస్తే..పేద, మధ్యతరగతి ప్రజలు మళ్లీ జగన్ పాలన కావాలని కోరుకుంటున్నారు. ఇదే సమయంలో ఉద్యోగులు, వ్యాపారుల్లో వైసీపీ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు వైసీపీకి అనుకూలంగా ఉండగా ,మిగిలిన జిల్లాలు కూటమికి అనుకూలంగా కనిపిస్తున్నాయి.

అయితే సీఎం జగన్ మూడు కీలక అంశాలపై ప్రజలకు హామీ ఇస్తే వైసీపీ గెలుపును ఎవరూ ఆపలేరని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో రైతుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఇప్పటికే రైతులకు జగన్ సర్కార్ పలు పథకాలను అందిస్తోంది. వీటితో పాటు , పంటలకు మద్దతు ధర,పంట రాయితీ, రుణమాఫీపై భరోసా కల్పిస్తే.. జగన్ పార్టీకి రైతులు అండగా నిలిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక మహిళలు వైసీపీ పాలన పట్ల పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారు. జగన్ ప్రభుత్వం ఇస్తోన్న మెజార్టీ పథకాలు మహిళలకే అందుతున్నాయి. దీంతో మహిళలు అధిక సంఖ్యలో వైసీపీ పార్టీకే మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. మద్యపాన నిషేదంతో పాటు, అభ్యున్నతి దిశగా వారికి జగన్ హామీ ఇవ్వాల్సి ఉంది.

సంక్షేమం విషయంలో దూసుకుపోతున్న జగన్ సర్కార్..అభివృద్ది విషయానికి వచ్చే సరికి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. రోడ్లు, మౌలిక వసతుల సదుపాయాల విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఉద్యోగాల కల్పన విషయంలో కూడా సీఎం జగన్ వెనకపడ్డారు. మౌలిక సదుపాయాల కల్పించడంతో పాటు , సాఫ్ట్‌వేర్, ప్రైవేట్ కంపెనీలు వచ్చే విధంగా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఈ మూడు కీలక అంశాలపై ప్రజలకు సీఎం జగన్ హామీ ఇస్తే వైసీపీకి తిరుగుండదని విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications