లడ్డూ ఆరోపణల వేళ.. తిరుమలకు పవన్- మళ్లీ వారాహి
Pawan Kalyan: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం.. రోజుకో మలుపు తిరుగుతోంది. కలియుగ వైకుంఠంలా అలరారుతున్న, సాక్షాత్ శ్రీమహావిష్ణువే కొలువుదీరిన తిరుమలపై, అక్కడి పవిత్రతపై, స్వామివారి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగడం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
కోట్లాదిమంది హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల అటు జాతీయ మీడియా సైతం దీనికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది. పలువురు జాతీయ స్థాయి నాయకులు దీనిపై స్పందించారు. ఈ ఆరోపణల వెనుక గల వాస్తవాలను వెలికి తీయాలంటూ సుప్రీంకోర్టునూ ఆశ్రయించారు.

తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తోన్నారని, నాణ్యత రహితమైన వస్తువులను వినియోగిస్తోన్నారంటూ చంద్రబాబు రెండు రోజుల కిందట ఆరోపించిన విషయం తెలిసిందే. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ.. గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు. ఈ విమర్శలు- సరికొత్త వివాదానికి తెర తీసినట్టయింది.
స్వయానా ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. టీడీపీ కూటమి భాగస్వామ్య పక్షం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏకంగా ప్రాయశ్చిత్త దీక్షను స్వీకరించారు. అటు తిరుమలలో మహా సంప్రోక్షణ చేపట్టారు. ఇందులో భాగంగా యజ్ఞయాగాదులను నిర్వహించారు టీటీడీ అధికారులు.
దీని తరువాత సంభవించిన పరిణామాల నేపథ్యంలో- జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను స్వీకరించాల్సి వచ్చింది. తిరుమల లడ్డూ అపవిత్రం కావడం వల్ల ప్రాయశ్చిత్తంగా ఈ దీక్షను చేపట్టారు. 11 రోజుల ఈ దీక్ష నేడు మూడో రోజుకు చేరింది. ఇందులో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేపట్టనున్నారు.

అక్టోబర్ 2వ తేదీన తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు పవన్ కల్యాణ్. దీనికోసం ఒకరోజు ముందే తిరుమలకు చేరుకుంటారు. 1వ తేదీన అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటారు. 2వ తేదీ ఉదయం స్వామివారిని దర్శించుకుని దీక్షను విరమిస్తారు. ఆ రోజు తిరుమలలోనే బస చేస్తారు.
ఆ మరుసటి రోజు అంటే అక్టోబర్ 3వ తేదీన తిరుపతిలో భారీ బహిరంగ సభను నిర్వహించే అవకాశం ఉంది. వారాహి సభను నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. తిరుమల లడ్డూ, వంద రోజుల పరిపాలన, సూపర్ 6 హామీల అమలు.. వంటి అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications