కిలో టమోటా రూ 100 - ఇంకా పెరిగేనా, ఎప్పటి వరకు..!!
టమోటా ధరలు మరోసారి పెరిగాయి. ఏకంగా కిలో టమోటా ధర రూ 100 వరకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల వ్యవధిలోనే టమోటా ధరలు ఒక్కసారిగా పెరిగాయి. రెండు రోజులగా ధరలను వ్యాపారులు భారీగా పెంచేసారు. ప్రస్తుతం హోల్‌సేల్ వ్యాపారులు కిలో టమాట రూ.80కి విక్రయిస్తుంటే, రిటైల్ వ్యాపారులు రూ.100కు విక్రయిస్తున్నారు.
కిలో టమోటా రూ 100
టమోటా ధరలు మళ్లీ కొండెక్కాయి. రోజుల క్రితం వరకు కిలో రూ.80 పలకగా తాజాగా రూ.100కు చేరింది. కొద్ది నెలల క్రితం టమోటా ధరలు వినియోగదారులకు చుక్కలు చూపించాయి. క్రమేణా తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు పండుగ సమయంలో తిరిగి టమోటా ధరలు తిరిగి ఆకాశాన్ని తాకుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని టమోటా మార్కెట్ లో కొద్ది రోజులుగా టమోటా రాక తగ్గింది. పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. తెలంగాణ, ఏపీలోని బహిరంగా మార్కెట్లలో టమోటా ధరలు కిలో రూ 100 వరకు ఉండటంతో అమ్మకాలు పూర్తిగా తగ్గాయి.

తగ్గిన ఉత్పత్తి
తాజాగా కురిసిన భారీ వర్షాలతో పంటలు దెబ్బ తిని ఉత్పత్తి తగ్గిందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కల్యాణదుర్గం, మదనపల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చే టమాట దిగుబడ తగ్గిపోయింది. ఇటీవల వరదలకు తోటలూ దెబ్బ తినడంతో అక్కడి హోల్‌సేల్ వ్యాపారులు ధరను ఒక్కసారిగా పెంచేశారు. ఏపీలో 22 కిలోల బాక్స్‌కు రూ.1,550 (కిలో రూ.70) చొప్పున విక్రయిస్తున్నారు. కాగా,, రవాణా, ఇతర ఖర్చులతో కలిపి ఇక్కడి మార్కెట్‌లో హోల్‌సేల్‌గా రూ.80కు అమ్మకాలు జరుగుతున్నాయి. రిటైల్ మార్కెట్ లో రూ 100 వరకు ధర పలుకుతోంది.
పైపైకి ధరలు
మరో వైపు నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. పప్పులు, నూనెల ధరలు పెరగటంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. కేజీ నువ్వులు రూ.180కు చేరింది. చక్కెర రూ.41, రవ్వ- రూ.42, గోధుమపిండి రూ.40 పలుకుతోంది. కూరగాయల ధరలూ మండుతున్నాయి. దీంతో, దసరా పెద్ద పండుగా జరుపుకునే వారికి నిత్యావసరాల ధరలు చుక్కలను చూపిస్తున్నాయి. ప్రభుత్వం ధరల నియంత్రణ దిశగా చర్యలు కనిపించటం లేదు. టమోటా దిగుబడి పైన ప్రభుత్వం ఆలోచన చేస్తే ధర నియంత్రణలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే, పండుగ లోగా ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications