టమోటా ఆల్ టైం రికార్డు ధర - తగ్గేది ఎప్పుడంటే..!!
గతంలో ఎన్నడూ లేని విధంగా టమోటా ధర పెరిగింది. కిలో టమోటా ధర డబుల్ సెంచరీకి చేరువ అయింది. వినియోగదారులకు భారంగా మారింది. గత నెల రోజులుగా టమోటా ధర పెరుగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కౌంటర్ల ద్వారా సబ్సిడీతో అమ్మకాలు నిర్వహిస్తున్నాయి. కానీ, అవి ఏ మాత్రం వినియోగదారులకు సరి పోవటం లేదు. ఓపెన్ మార్కెట్ లో ధర ప్రస్తుతం రూ 196కి చేరింది. అయితే ఇంతగా ధర ఎప్పుడు ఉండే పరిస్థితి లేదు.
టమోటా కొత్త రికార్డు
టమోటా ధర రికార్డు క్రియేట్ చేసింది. మదనపల్లి మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా టమోటా ధర పలుకుతోంది. నాణ్యమైన టమోటా ధర రూ 196కి చేరింది, ఈ నెల 26న కిలో రూ 168 వరకు పలికిన ధర ఆమాంతంగా పెరిగింది. శనివారం 253 టన్నుల సరుకునే రైతులు యార్డుకు తీసుకొచ్చారు. మొదటి రకం కిలో రూ 160 నుంచి రూ 196, రెండో రకం రూ 120 నుంచి రూ 156 వరకు పలికింది. 25 కిలోల క్రేట్ ధరను రూ 4,200 నుంచి రూ 4,900 మధ్య కొన్న వ్యాపారులు ఇతర నగరాలకు ఎగుమతి చేస్తున్నారు.

మరో నెల రోజులు ఇలాగే
విజయవాడ, విశాఖ, నెల్లూరు, తిరుపతితో పాటుగా చెన్నై, ఢిల్లీ, కోల్ కతాలకు ఎగుమతి చేస్తున్నారు. మదనపల్లె మార్కెట్ పరిధిలో మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్ని సీజన్ గా పరిగణిస్తారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడు మదనపల్లె నుంచే టమోటా ఎగుమతి అవుతోంది. మదనపల్లె పరిధిలోని 500 ఎకరాల నుంచే దిగుబడి వస్తోంది. జూన్ 15 నుంచి జూలై వరకు మదనపల్లె పరిధిలో రెండు వేల ఎకరాల్లో రైతులు టమోటా సాగు వేసారు. ఈ దిగుబడులు 40 రోజుల్లో వస్తాయని, ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో పూత దశలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
మదనపల్లెలో అత్యధిక ధర
ప్రస్తుతం ఉన్న ధరలు హెచ్చు తగ్గులతో ఆగస్టు నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్రం టమోటా సబ్సిడీ ధరలకు అందించేందుకు ముఖ్యమైన నగరాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నా..అవి ఏ మాత్రం డిమాండ్ కు అనుగుణంగా లేవు. ఏపీ ప్రభుత్వ రైతు బజార్ల ద్వారా అమ్మకాలు సాగిస్తోంది.

సబ్సిడీ ధరకు టమోటాలు విక్రయించే కేంద్రాల వద్ద పెద్ద సంఖ్య లో క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. టమోటా సాగు చేసిన రైతులు మాత్రం కోటీశ్వరులు అవుతున్నారు. కొనుగోలు చేయాలనుకొనే వినయోగదారులకు మాత్రం భారం తప్పటం లేదు. మరో నెల రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications