TTD: తిరుమలలో భక్తుల జాతర- టీటీడీ తాజా నిర్ణయంతో..!!
Tirumala: తిరుమలలో కొత్త విధానాల అమలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. రికార్డు స్థాయి లో భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఒకే రోజు 80 వేల మందికి పైగా భక్తులకు శ్రీవారి దర్శ నం అందుతోంది. జూన్‌లో ఏకంగా 24.08 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ కానుకలు గతంతో పోల్చుకుంటే అధికంగా లభించాయి. టీటీడీ అమలు చేస్తున్న క్యూలైన్ మేనేజ్ మెంట్ సిస్టమ్ తో వేగంగా దర్శన అవకాశం కలుగుతోంది.
జూన్ నెలలో శ్రీవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనం చేసుకున్నారు. నూతనంగా తీసుకొచ్చిన క్యూ లైన్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ద్వారా మంచి ఫలితాలు అందుతున్నాయి. ఎంత మంది భక్తులు వచ్చినా అత్యంత ఖచ్చితత్వంతో వేగంగా దర్శనాలకు వెళ్లే అవకాశం కలుగుతోంది. ఈ విధానం ద్వారా భక్తులు ఎక్కడ ఎక్కువగా ఉన్నారు.. ఏ ప్రాంతంలో ఖాళీ ఉందనే విషయం గుర్తిస్తున్న అధికారులు తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. బ్రేక్ దర్శనాల వేళల మార్పు వేగంగా దర్శనాలు పూర్తి చేసేందుకు ఉపకరించింది. దీని ద్వారా జూన్ నెలలో తిరుమల శ్రీవారికి భారీగా హుండీ ఆదాయం లభించింది. గత నెలలో 24.08 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు.

ఇక, జూన్ నెలలో టీటీడీకి రూ.119.86 కోట్లు ఆదాయం వచ్చింది. సగటున రోజుకు 80 వేల మంది స్వామిని దర్శించుకున్నారు. అత్యధికంగా 14వ తేదీన 91,720 మంది శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఐదు రోజులు 90 వేలకు పైగా, పది రోజులు 80 వేల మందికిపైగా శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. వేసవి సెలవులు ముగింపునకు రావడంతో ఈ సంఖ్య భారీగా పెరిగిందని అంచనా. ఇక, హుండీ ద్వారా రోజుకు సగటున రూ.4 కోట్ల కానుకలు రాగా, అత్యధికం గా 30వ తేదీన రూ.5.30 కోట్లు లభించింది. అలాగే జూన్‌లో 10.05 లక్షల మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
అత్యధికంగా 7వ తేదీన 45,068 మంది తలనీలాలు ఇచ్చారు. ఇలా ఉండగా మే నెలలో 23.77 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.106.83 కోట్లు లభించింది. టీటీడీలో రానున్న రోజుల్లో సాంకేతికత వినియోగించి భక్తులకు మెరుగైన సేవలు అందించేలా టీటీడీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు సంస్థలతో చర్చలు పూర్తి చేసింది. ఈ ప్రక్రియ పూర్తయితే ప్రతీ భక్తుడికి శాశ్వత ఐడీ కల్పించి.. ఎప్పుడు తిరుమల వచ్చినా, దర్శనం - వసతి విషయాల్లో సమస్య లేకుండా సౌకర్యం పొందేలా కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇక.. కొండ పైన రద్దీ తగ్గించేలా అలిపిరి వద్దే బేస్ క్యాంప్ నిర్మాణం పైన చర్చలు జరుగుతున్నాయి. సాధ్యమైనంత త్వరలో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చేలా కసరత్తు కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications