నడిరోడ్డుపై ఒక్కసారిగా నిలిచిపోయిన ట్రాఫిక్... పడగవిప్పిన నాగుపాము చేసిన పనికి అందరూ షాక్!!
ఎక్కడైనా రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయిందంటే ఎవరైనా మంత్రులో, ఉన్నతాధికారులో ప్రయాణం చేస్తూ ఉంటారు అని భావిస్తాం. లేదా ట్రాఫిక్ ఎక్కువగా ఉండి ఉంటుందని, ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తాం. కానీ అటువంటిదేమీ లేకుండా ఒక్కసారిగా ట్రాఫిక్ అంతా నిలిచిపోయింది అంటే ఒకింత ఆశ్చర్యానికి గురవుతాం.

నడిరోడ్డుపై ట్రాఫిక్ ను ఆపిన నాగుపాము
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో నడిరోడ్డుపై ఏమి జరిగిందో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా టెన్షన్ పడతాం. ఇంతకీ ఏం జరిగింది? అసలు ఈ కథాకమామీషు ఏమిటి అంటే.. ప్రకాశం జిల్లా దోర్నాల - మార్కాపురం ప్రధాన రహదారిలో అప్పటివరకు కొనసాగుతున్న ట్రాఫిక్ ఒక్కసారిగా నిలిచిపోయింది. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు సిగ్నల్ ఇవ్వకుండానే ఆగిపోయారు. రోడ్డు పై ఎలాంటి ఇబ్బంది లేకుండానే వాహనదారులు ఎక్కడికక్కడ ఆగిపోయారు. అందుకు కారణం రోడ్డు మధ్యలో చక్కగా పడగ విప్పి కూర్చున్న నాగుపాము.

వాహనదారులను వెంబడించి పాము హల్చల్
నడిరోడ్డుపై నాగుపాము దర్శనమివ్వడంతో ఒక్కసారిగా వాహనదారులు షాక్ కు గురయ్యారు. పెద్దారవీడు మండలం బద్విడు చెర్లోపల్లివద్ద ఓ నాగుపాము నడిరోడ్డు పై పడగా విప్పి వాహనాలు పోకుండా అడ్డగించింది. నన్ను దాటి ఎలా వెళ్తారు అంటూ రోడ్డుపై కూర్చుంది. ఎవరైనా దానిని పట్టించుకోకుండా ముందుకు వెళితే ఆ వాహనాలను వెంబడిస్తూ హల్ చల్ చేసింది. దీంతో వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు.
అరగంట పాటు ట్రాఫిక్ జామ్ .. పడగ విప్పి హంగామా
సుమారు అరగంట పాటు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పాము ఎక్కడ తమ వద్దకు వస్తుందో అని వాహనదారులు టెన్షన్ పడ్డారు. ఆ తర్వాత ఆ నాగు పాము వెళ్ళి పోయేవరకు నిరీక్షించిన వాహనదారులు కాస్త ఊపిరి పీల్చుకుని తమ ప్రయాణాన్ని మళ్ళీ ప్రారంభించారు. మొత్తానికి రోడ్డు మధ్యలోకి వచ్చి హల్ చల్ చేసిన నాగుపాము వాహనదారులను హడలెత్తించింది. అరగంటపాటు నడిరోడ్డుపై ఠీవిగా, దర్జాగా పడగ విప్పి హంగామా చేసింది.












Click it and Unblock the Notifications