టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ : కేసీఆర్ టార్గెట్ పీఎం మోదీ - చంద్రబాబు కీ రోల్..!!
KCR BRS: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. నిన్నటి దాకా టీఆర్ఎస్ అధినేత. నేడు బీఆర్ఎస్ అధ్యక్షుడు. తెలంగాణ రాజకీయాల్లో సాటి లేని పొలిటికల్ లీడర్. వ్యూహ ప్రతివ్యూహాల్లో ఏం చేసినా పక్కా లెక్కతోనే చేస్తారు. ఇప్పుడు 21 ఏళ్ల రాజకీయ పార్టీని..జాతీయ పార్టీగా మార్చారు. తెలంగాణ ఉద్యమ నేతగా ప్రారంభించిన కేసీఆర్..అదే పార్టీలో తెలంగాణలో రెండు సార్లు సీఎం అయ్యారు. ఎంతో మందిని నేతలుగా మార్చిన టీఆర్ఎస్ జెండా రూపాంతరం చెందింది. అయితే, కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో కీలక మలుపులు. మరెనో గెలుపు - ఓటములు. అయితే, కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో ఇప్పుడు ప్రధాని మోదీ పదే పదే ప్రస్తావిస్తున్నా..అదే బీఆర్ఎస్ ఏర్పాటుకు కీలకమైనా..అసలు గుర్తు పెట్టుకోవాల్సిందీ..కీలక పాత్ర టీడీపీ అధినేత చంద్రబాబు.

నాడు చంద్రబాబు టీంలో కీలక వ్యక్తిగా
కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఎన్టీఆర్ స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చి..చంద్రబాబు నాయకత్వంలో పని చేసి..అదే చంద్రబాబు తెలంగాణలో రాజకీయంగా ఎదగకుండా చేసిన అసలు సిసలు రాజకీయ వేత్త. 1985లో సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పని చేసారు. తరువాత చంద్రబాబు ప్రభుత్వంలో 1996లో రవాణా శాఖా మంత్రిగా వ్యవహరించారు. 1999 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి 27 వేలకుపైగా మెజారిటీతో గెలిచారు. కేసీఆర్ మంత్రి పదవి ఆశించగా.. చంద్రబాబు ఇవ్వలేదు. కేసీఆర్‌ను డిప్యూటీ స్పీకర్‌గా నియమించారు. చంద్రబాబు తీసుకున్న ఆ నిర్ణయం కేసీఆర్ కోపానికి కారణమైంది. 1999లో కరెంట్ చార్జీల పెంపును నిరసిస్తూ బషీర్‌బాగ్‌లో నిరసనలు చేసిన రైతులపై పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు చనిపోయారు. నాడు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్.. సీఎం చంద్రబాబుకు రైతుల కష్టాలు, కాల్పుల ఘటనపై బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ మేధావులతో చర్చలు చేసారు. తెలంగాణకు అన్యాయం జరుగుతోందని నినదించారు. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పేరుతో ఉద్యమ పార్టీ స్థాపించారు. పార్టీ ఏర్పాటైన 9 రోజుల్లోనే 19 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు.

తెలంగాణలో అధికారం..చంద్రబాబుకు ఛాన్స్ లేకుండా..
టీఆర్ఎస్ తొలుత 2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసింది. ప్రభావం చూపింది. 2001 ఆగస్టు 18న టీఆర్ఎస్‌కు రాజకీయ పార్టీ హోదా వచ్చింది. అదే ఏడాది సెప్టెంబర్ 21న జరిగిన ఉప ఎన్నికలో సిద్దిపేట నుంచి కేసీఆర్ గెలిచారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జట్టు కట్టి పోటీ చేసింది టీఆర్ఎస్. బంజారాహిల్స్ రోడ్ నం.12లో టీఆర్ఎస్ ఆఫీసుకు నాటి సీఎం వైఎస్ఆర్ స్థలాన్ని కేటాయించారు. 2006లో తెలంగాణ భవన్‌ను ప్రారంభించారు. వైఎస్ విధానాలు నచ్చక కేసీఆర్.. కాంగ్రెస్‌తో పొత్తును విరమించుకున్నారు. 2009లో టీడీపీతో జట్టు కట్టారు. వామపక్షాలు, టీడీపీ, టీఆర్ఎస్ కలిసి మహాకూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. కానీ ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది కేవలం 10 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లే. 2009లో వైఎస్సార్ మరణించారు. తరువాత జరిగిన పలు పరిణామాలతో తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పాటైంది. నాటి ఎన్నికల్లో 63 స్థానాల్లో గెలిచి సొంత రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయింది. కానీ, ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ అడ్డంగా దొరికిపోయారు. కేసీఆర్ వర్సస్ చంద్రబాబు ఇద్దరు సీఎంలు ఈ విషయంలో తీవ్ర స్థాయికి వెళ్లారు. ఆ తరువాత చంద్రబాబు అమరావతికి వెళ్లిపోవటంతో వివాదం పక్కకు వెళ్లిపోయింది. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ఠ్ ఇస్తానని అప్పట్లో కేసీఆర్ ప్రకటించారు.

2018 లో అధికారం..క్రమేణా మోదీతో దూరం
2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్..వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చారు. కేంద్రంలో ప్రధాని మోదీతోనూ సత్సంబంధాలు కొనసాగించారు. ఇటు ఏపీలో 2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ అధికారం లోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో కేసీఆర్ సహకారం చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ కు లభించిందనే ప్రచారం ఉంది. ఇక, తెలంగాణలో టీడీపీ నుంచి గెలిచిన వారు టీఆర్ఎస్ లో విలీనం అయ్యారు. తెలంగాణలో బలమైన పార్టీగా ఉండే టీడీపీ ఇప్పుడు నామమాత్రంగా మారింది. ఇక, తెలంగాణలో బీజేపీ తమ పార్టీ విస్తరణ పైన పోకస్ చేసింది. అప్పటికే కాంగ్రెస్ పేరుకు మాత్రమే పోటీగా ఉంది. ఇటు కేసీఆర్ సడన్ గా తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. నాడు చంద్రబాబు ప్రధాని మోదీ పై మొదలు పెట్టిన యుద్దం తరహాలోనే రాజకీయ ఫైట్ ప్రారంభించారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తెలంగాణ నుంచే అడుగు పడుతుందని ప్రకటించారు. ఈ ఏడాది దసరా నాడు టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మారుస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు అధికారికంగా బీఆర్ఎస్ ఏర్పాటు జరిగింది. ఇటు తెలంగాణలో హ్యాట్రిక్ విజయం సాధించటం..అటు కేంద్రంలో తన బీజేపీకి వ్యతిరేకంగా తన శక్తిని చాటటం ఇప్పుడు సీఎం కేసీఆర్ ముందున్న లక్ష్యాలు. ఏ మేర సక్సెస్ అవుతారనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications