శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన - టికెట్లు జారీ ఇలా..!!
ఈ సారి వైకుంఠ ద్వార దర్శనాల పై టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగే విధంగా తాజాగా నిర్ణయం తీసుకున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయిన టీటీడీ... ఈ మేరకు టికెట్ల జారీ పైన విధి విధానాలు ఖరారు చేసారు. రద్దీ రోజుల్లో అభిషేక సేవా సమయంలో నూ సర్వ దర్శనం కల్పించేందుకు టీటీడీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.
తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేకత ఉంది. వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఏ ఏడాది అదే విధంగా పది రోజు ల పాటు ఉత్తర ద్వార దర్శనాలు తెరుచుకోనున్నాయి. డిసెంబర్ 20 నుండి 29వ తేది వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి కీలక సమీక్ష నిర్వహించారు.

తిరుమలలో బ్రహ్మోత్సవాల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు ప్రణాళికాబద్ధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గత వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించి విజయవంతంగా నిర్వహించిన ఉత్సాహంతో ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలను కూడా విజయవంతం చేసేందుకు కృషి చేయాలని చెప్పారు.
అదే విధంగా సాధారణ భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు గత వైకుంఠ ద్వార దర్శనాల్లో చేసిన విధంగానే తొలి మూడు రోజులకు ఆన్ లైన్ లో ఈ-డిప్ ద్వారా ఎస్ఎస్డీ టోకెన్లు కేటాయించాలని చెప్పారు. తర్వాతి ఏడు రోజులు సర్వ దర్శనం అమలు చేయాలని తెలిపారు. డిసెంబర్ 25వ తేది శుక్రవారం రోజున స్వామివారి అభిషేక సేవ సమయంలో కూడా సర్వ దర్శనం భక్తులకు దర్శనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు దర్శన క్యూ లైన్లను పర్యవేక్షిస్తూ సామాన్య భక్తులకు వీలైనంత త్వరగా స్వామివారి దర్శనం కలిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేపడతామని చెప్పారు. తిరుమలలో పార్కింగ్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. చివరి ఏడు రోజుల్లో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగిన విధంగా ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు.














Click it and Unblock the Notifications
