TTD: ఆ సమయమే కీలకం, సామాన్యులకు దర్శనం పై టీటీడీ కీలక నిర్ణయం..!!
Tirumala: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణం గా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే భక్తుల ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షణ చేస్తోంది. కాగా.. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి.. నూతన సంవత్సరం వరుసగా ఉండటంతో.. భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. సేవల పెంపుతో పాటుగా.. ఈ రద్దీ సమయంలో భక్తుల దర్శనాల పైన కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా టీటీడీ బోర్డు అత్యవసర సమావేశానికి నిర్ణయించారు.
టీటీడీ పాలక మండలి బోర్డు రేపు (మంగళవారం) అత్యవసరంగా సమావేశం కానుంది. ఇప్పటికే వైకుంఠ ఏకాదశి పది రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ వేళ తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాట కారణంగా ప్రాణ నష్టం జరిగింది. దీంతో, గతంలో నిర్వహించిన విధంగా వైకుంఠ ఏకాదశి రెండు రోజులకే పరిమితం చేయాలని పలువురు స్వామీజీలు టీటీడీని కోరారు. ఇదే అంశం పైన గత పాలక వర్గం సమావేశం లో చర్చించిన సభ్యులు.. పది రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయించారు. అయితే, గత అనుభవాల కారణంగా ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో టికెట్ల జారీకి ఏ విధంగా అమలు చేయాలనేది డిసైడ్ కాలేదు. దీని పైన పాలక మండలిలోని కొందరి సభ్యులతో సబ్ కమిటీ నియమించారు. ఈ కమిటీ రేపు జరిగే బోర్డు సమావేశంలో తమ ప్రతిపాదనలను అందించనుంది.

ఈ ఏడాది డిసెంబర్ 30, 31 తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నిర్వహించనున్నారు. ఆ రెండు రోజులు వీఐపీల నుంచి సాధారణ భక్తుల వరకు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలి వస్తారు. ఈ రద్దీకి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యల పైన ఈ ప్రత్యేక బోర్డు సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటారు. ఆఫ్ లైన్ - ఆన్ లైన్ విధానంలో టికెట్ల జారీ పైన నిర్ణయం వెల్లడించనున్నారు. రద్దీని నియంత్రించేందుకు ఆన్ లైన్ లో టికెట్ల జారీ చేయాలనే సూచనలు ఉన్నాయి. కాగా, వెయ్యి వరకు ఆప్ లైన్ లోనూ ఇవ్వాలనే ప్రతిపాదన రావటంతో.. ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా పది రోజుల పాటు శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం కొనసాగనుంది. ఇదే సమయంలో కొత్త సంవత్సరం కావటంతో మరింత రద్దీ పెరుగుతుందని భావిస్తున్నారు. దీంతో, ఈ రద్దీ రోజుల్లో వీఐపీల నియంత్రణ... సాధారణ భక్తులకు దర్శనంలో ఇబ్బందులు లేకుండా బోర్డు భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications