తిరుమలలో భారీ నిర్మాణం: భక్తులకు నిరంతరాయంగా..!!
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు 75,104 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 31,896 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.66 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 24 నుంచి 26 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

టీటీడీ భవిష్యత్ అవసరాల కోసం తిరుమలలో ఓ భారీ గ్యాస్ స్టోరేజీ ప్లాంట్ నిర్మాణానికి పూనుకుంది. తిరుమల ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఇది నిర్మితం కానుంది. 45 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గ్యాస్ స్టోరేజ్ కేంద్రం నిర్మాణానికి కొద్దిసేపటి కిందటే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు భూమిపూజ చేశారు.
టీటీడీ అవసరాల కోసం గత రెండు దశాబ్దాలుగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ ఎల్పీజీ వంటగ్యాస్ ను నిరంతరాయంగా సరఫరా చేస్తోంది. ఇదే విధానం మరో మూడు దశాబ్దాల పాటు కొనసాగించాలని టీటీడీ నిర్ణయించుకుంది. 30 సంవత్సరాల పాటు ఎల్పీజీ వంటగ్యాస్ ను సరఫరా చేసేలా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
8.13 కోట్ల రూపాయల వ్యయంతో ఈ గ్యాస్ స్టోరేజీ ప్లాంట్ నిర్మితం కానుంది. దీనికోసం 1.86 ఎకరాల స్థలాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు కేటాయించింది టీటీడీ. ఆరు నెలల్లో ఈ ప్లాంట్ పూర్తి కానుంది. ఈ గ్యాస్ ను లడ్డూ, అన్నప్రసాదాల తయారీకి వినియోగిస్తారు.
ఐఓసీఎల్ ఇప్పటికే తిరుమల డంపింగ్ యార్డు వద్ద 12.05 కోట్ల రూపాయల వ్యయంతో బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ప్రతి రోజు వచ్చే 55 టన్నుల తడి వ్యర్థాలలో 40 టన్నులు ఐఓసీఎల్ ప్లాంటుకు తరలించి రోజుకు 1,000 కేజీల బయో గ్యాస్‌ను ఉత్పత్తి చేయనున్నారు.
ఈ ప్లాంట్‌లో 45 మెట్రిక్ టన్నుల మౌండెడ్ స్టోరేజ్ వెసల్స్, 1500 కిలోల వేపరైజర్, అగ్నిమాపక యంత్రాంగం, స్ప్రింక్లర్ వ్యవస్థ, రెండు వాటర్ ట్యాంకులు, డీజిల్ జనరేటర్ సెట్, రిమోట్ ఆపరేటింగ్ వాల్వులు, గ్యాస్ లీకేజ్ అలారం, ట్యాంక్ లారీ డికాంటేషన్ వ్యవస్థ, సీసీటీవీ, జీఎంఎస్, టీఎఫ్‌ఎంఎస్, ఐఎల్‌ఎస్‌డీ వంటి అత్యాధునిక భద్రతా పరికరాలు ఏర్పాటు చేయనున్నారు.












Click it and Unblock the Notifications