ఆ స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ ఛైర్మన్
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో క్రిక్కిరిసిపోతోంది. మంగళవారం నాడు 80,964 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 32,125 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.24 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. అళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 నుంచి 17 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్‌లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తిరుమలలో వెలిసిన జాపాలి శ్రీ ఆంజనేయ స్వామి వారికి టీటీడీ తరఫున చైర్మన్ బీఆర్ నాయుడు పట్టు వస్త్రాలను సమర్పించారు. స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.
తొలుత- ఆలయం వద్దకు చేరుకున్న ఛైర్మన కు అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వాగతం పలికారు. జాపాలి ఆంజనేయస్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ప్రత్యేకం పూజలు నిర్వహించిన అనంతరం సింధూర వస్త్రంతో ఆయనను సత్కరించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ హనుమజ్జయంతి రోజున జాపాలి హనుమాన్ కు టీటీడీ తరుపున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. దాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగించామని చెప్పారు. భక్తులందరికీ హనుమంతుని అనుగ్రహం కలగాలని ప్రార్థించినట్లు తెలియజేశారు.
టీటీడీ పరిధిలో గల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎదురు ఆంజనేయ స్వామి ఆలయం, జీటీ ఆలయం, మఠం ఆంజనేయ స్వామి ఆలయం, గాంధీ రోడ్, అభయ ఆంజనేయ స్వామి ఆలయం, ఓల్డ్ హుజూర్ ఆఫీస్,, శ్రీ భక్త ఆంజనేయ స్వామివారి ఆలయం, అలిపిరి శ్రీపాదాల మండపంలల్లో ఈ వేడుకలు జరిగాయి.
అలాగే- కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయం పరిధిలో శ్రీ అభయ హస్త ఆంజనేయ స్వామి వారి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంకు ఎదురుగా ఉన్న శ్రీ సంజీవరాయ స్వామి ఆలయాలలో శాస్త్రోక్తంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications