శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి- టోల్ ఫ్రీ నంబర్
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం నాడు 69,746 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 23,649 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.27 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 13 కంపార్ట్‌మెంటల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.
కాగా శ్రీవారి భక్తులు మరోసారి నకిలీ వెబ్‌సైట్ల బారిన పడ్డారు. టీటీడీ పేరుతో వెలువడే ఇతర అనధికారిక వెబ్‌సైట్లల్లో స్వామివారి దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు, వసతి గదులను బుక్ చేసుకుని మోసపోతున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి.

వీటిపై టీటీడీ అధికారులు స్పందించారు. శ్రీవారి భక్తులు ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు, వసతి గదులను బుక్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే వినియోగించాలని టీటీడీ నిఘా, భద్రతా విభాగం అధికారులు విజ్ఞప్తి చేసింది. నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని స్పష్టం చేశారు.
నకిలీ వెబ్‌సైట్లను సంప్రదించి మోసపోయినట్టు పలువురు భక్తుల నుండి టిటిడికి పలు ఫిర్యాదులు అందాయని, వీటిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సమాచారం, శ్రీవారి దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, వసతి గదులను బుక్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ TTDevasthanams.ap.gov.in మాత్రమే ఉందని చెప్పారు. ఇతర వివరాల కోసం టీటీడీ కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నంబర్ 155257ను సంప్రదించాలని సూచించారు.
మరోవంక- తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజైన మంగళవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు తెప్పపై విహరించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది.
ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. స్వామి, అమ్మవార్లు మూడుసార్లు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం కన్నుల పండువగా ముగిసింది.












Click it and Unblock the Notifications