అన్ని రకాల సిఫార్సు లేఖలకు టీటీడీ బ్రేక్
తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదుల కేటాయింపులకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడం, దానితో పాటు ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి రావడంతో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖుల నుంచి వచ్చే సిఫార్సు లేఖల స్వీకరణను తాత్కాలికంగా రద్దు చేసింది, కోడ్ ఆఫ్ కండక్ట్ తొలగిపోయిన తర్వాతే వాటిని మళ్లీ పునరుద్ధరిస్తా మని టీటీడీ తెలిపింది.
ఈ నిబంధనల ప్రకారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఇచ్చే ఎలాంటి సిఫార్సు లేఖల ఆధారంగా శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు గానీ, తిరుమలలోని కాటేజీలు గానీ, గదుల కేటాయింపులు గానీ ఉండవు. తిరుమలకు స్వయంగా విచ్చేసే ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ఉన్నతాధికారులకు మాత్రం ఎన్నికల నిబంధనలకు లోబడి అధికారిక దర్శనం, వసతి సదుపాయాలు కల్పిస్తారు.

కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం, పీఆర్‌వో విభాగం, వివిధ ప్రాంతాల్లో ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలు ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నియమాల ప్రకారం ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని, ఏ ఒక్క సిఫార్సు లేఖనూ పరిగణనలోకి తీసుకోకూడదని స్పష్టం చేశారు.
ఈ ప్రత్యేక ఆంక్షలు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయి, ఎన్నికల కోడ్ ఉపసంహరించేంత వరకు అమల్లో ఉంటాయని వివరించారు. తిరుమల యాత్రకు సిద్ధమయ్యే భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని కోరారు. ఎలాంటి సిఫార్సు లేఖలపై ఆధారపడకుండా, టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ముందస్తుగా శ్రీవారి దర్శనం టికెట్లు, వసతి గదులను బుక్ చేసుకుని తిరుమలకు రావాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే నామినేషన్ల దాఖలు, వాటి స్క్రూటినీ ముగిసింది. నేడు నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. ఈ నెల 28వ తేదీన పోలింగ్ జరుగనుంది. 30న ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 100 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. లీగల్ సమస్యల వల్ల మరో 23 చోట్ల పోలింగ్ నిర్వహించట్లేదు. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇప్పటికే వెలువడింది. వీటికి నవంబర్ 3వ తేదీన పోలంగ్ నిర్వహిస్తారు. 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది.














Click it and Unblock the Notifications
