అలిపిరి- తిరుమల మెట్ల మార్గంలో ఇకపై..!!
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం 77,185 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 23,098 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.06 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఆరు కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లు, కంపార్ట్‌మెంట్లల్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, పాలు, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

తిరుమలలో అటవీ వృక్ష సంపద పెరుగుదల, జనావాసాల్లోకి చిరుతలు, ఇతర వన్య ప్రాణుల ప్రవేశాన్ని నిరోధించడం వంటి చర్యలపై అటవీ శాఖ అధికారులతో టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు గురువారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలో జరిగిన ఈ సమావేశంలో జేఈఓ వీరబ్రహ్మం, డీఎఫ్ఓ ఫణికుమార్ నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఫణికుమార్ నాయుడు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. గత ఏడాది శేషాచలం అడవులు, తిరుమలలో అటవీ సంపదను పెంపొందించడానికి చేపట్టిన కార్యక్రమాలు, దశలవారీగా అకేసియా ఆరికులిఫార్మిస్ వృక్షాల స్థానంలో స్థానిక వృక్షజాతుల పెంపకం, ఔషధ వనాల అభివృద్ధి, సుస్థిర అటవీ పునరుద్ధరణ చర్యలు వంటి అంశాల గురించి వివరించారు.
గత ఏడాదిలో లక్ష్యంగా పెట్టుకున్న 20,000 మొక్కల్లో భాగంగా ఇప్పటివరకు తాండ్ర, రావి, ఉసిరి, వెలగ, జువ్వి, మర్రి, నేరేడు, అత్తి, ఎర్రచందనం వంటి స్థానిక జాతుల 7,000 మొక్కలు నాటినట్టు వివరించారు. అదనంగా, వాటర్‌షెడ్, మట్టి స్థిరీకరణ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు.
వన్యప్రాణుల కదలికలను పసిగట్టడం, వాటి సంచారం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అలిపిరి- తిరుమల మార్గాల రెండు వైపులా 60 కెమెరా ట్రాపులు, 31 సౌర శక్తితో నడిచే యాక్టివ్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు.
ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడారు. అటవీ శాఖ అధికారులు మరింత ఆధునిక సర్వైలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో పాటు తిరుమలకు సమగ్ర పర్యావరణ సుస్థిరత ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అలిపిరి-తిరుమల మెట్ల మార్గం సహా అన్ని చోట్ల ఈ సర్వైలెన్స్ అమర్చాలని చెప్పారు.












Click it and Unblock the Notifications