ఏపీలో సమ్మె విరమణలో భారీ ట్విస్ట్ - ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం : కార్యాచరణ ప్రకటన దిశగా..!!
ఏపీలో ఉద్యోగ సంఘాలు సమ్మె విరమణ ప్రకటన చేసాయి. మంత్రుల కమిటీతో సుదీర్ఘంగా జరిపిన చర్చల సమయంలో పలు అంశాల పైన ఒప్పందం కుదిరింది. దీని పైన మంత్రులు..ఉద్యోగ సంఘాల నేతలు కలిసి కట్టుగా నిర్ణయాలను ప్రకటించారు. అయితే, ఈ సమయంలోనే సమ్మె సమస్య పరిష్కారం అయిందని ప్రభుత్వం భావిస్తున్న సమయంలో ఇప్పుడు కొత్త అంశం తెర పైకి వచ్చింది. చర్చల సమయంలోనే ప్రభుత్వ ప్రతిపాదనలు.. పీఆర్సీ సాధన సమితి నేతలు ఒప్పందాలు చేసుకొనే సమయంలోనే కొన్ని అంశాలతో ఉపాధ్యాయ సంఘాల నేతలు విభేదించారు.

ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరం
అయితే, దీని పైనా ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టత ఇచ్చారు. ఒక నిర్ణయం తీసుకొనే సమయంలో కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటం సహజమని..కానీ, సీఎం వద్దకు వెళ్లే సమయంలో ఈ ఒప్పందాల పైన భిన్నంగా స్పందిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నేతలను తీసుకెళ్తామని పీఆర్సీ సాధన సమితి నేతలు వెల్లడించారు. ఈ నిర్ణయాలను చీకటి ఒప్పందాలుగా అభివర్ణించారు. చర్చల్లో సఫలమైంది ప్రభుత్వమేనని.. తాము విఫలమయ్యామని ఏపీటీఎఫ్ అధ్యక్ష - ప్రధాన కార్యదర్శులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చర్చల్లో సీపీఎస్ రద్దు విషయంలో ఎటువంటి నిర్ణయమూ జరగలేదని చెప్పలేదు. హెచ్ఆర్ఏ శ్లాబులు పునరుద్దించుకోలేక పోయామని..ఆ విషయంలో గ్రామీణ ప్రాంత ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు.

చర్చలు విఫలమంటూ
సీనియర్ సిటిజన్లకు పాత అదనపు ఫించను సాధించుకోలేకపోయామని పేర్కొన్నారు. ఐఆర్ ఇచ్చిన తేదీ నుంచి మానిటర్ బెనిఫిట్ ఇవ్వాలనే డిమాండ్ పైన చర్చ జరగనే లేదని చెప్పుకొచ్చారు. కాంట్రాక్టు..అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదని వివరించారు. 11వ పీఆర్సీ నివేదికను చూడలేకపోయామంటూ వ్యాఖ్యానించారు. ప్రధాన డిమాండైన ఫిట్ మెంట్ ను 27 శాతానికి పెంచుకోలేకపోయామని వాపోయారు. ప్రభుత్వంతో పీఆర్సీ సాధన సమితి చర్చలు ఆమోదయోగ్యం కాదని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు అన్నారు.

సీఎం వద్దకు సంఘాలతో కలిసి
ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. అయితే, ఈ రోజు సీఎం వద్దకు ఉపాధ్యాయ సంఘాల నేతలను తీసుకెళ్తామంటూ పీఆర్సీ సాధన సమితి నేతలు చెప్పటం తో అక్కడ సీఎం తో ఏమైనా ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరాల పైన స్పందన వస్తుందా..రాదా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. ఉపాధ్యాయ సంఘాలు ఎటువంటి కార్యాచరణ ప్రకటించక ముందే ప్రభుత్వం వారిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.












Click it and Unblock the Notifications