విశాఖలో ఢీ అంటే ఢీ, వరుదు కల్యాణి పై కొత్త అంచనాలు- ఆ ఒక్కటే మైనస్..!!
సాగర తీరాన మేయర్ సమరం ఆసక్తిగా మారుతోంది.ఇక్కడ టీడీపీ- వైసీపీ మధ్య ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోటీ నెలకొంది.కూటమి ఇక్కడ భారీ మెజార్టీ ఖాయమని చెబుతోంది.వైసీపీ అభ్యర్ధి గా వరుదు కల్యాణి ప్రకటన తరువాత మార్పు కనిపించింది.ప్రచారంలోనూ మార్పు కనిపించింది.టీడీపీ అభ్యర్ధికి కూటమి నేతలు మద్దతుగా నిలిచారు.వరుదు కల్యాణి స్థానిక పరిచయాలతో ముందుకు వెళ్తున్నారు. కాగా..వరుదు కల్యాణి ప్రచారంలో మైనస్ గా మారిన ఆ ఒక్క అంశం ఇప్పుడు పార్టీలో కీలక చర్చగా మారుతోంది.
విశాఖ నగర మేయర్ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది.ఇక్కడ కూటమి పార్టీలు విశాఖ నగర పరిధిలో ఈ ఎన్నిక సవాల్ గా తీసుకున్నారు.దీంతో,వైసీపీ నుంచి మాజీ సీఎం జగన్ ఏరి కోరి వరుదు కల్యాణిని ఎంపిక చేసారు.మండలిలో టీడీపీ నేతల పై తన వాగ్దాటి తో ఇరుకున పెట్టిన మహిళా నేతగా వరుదు కల్యాణికి పట్టు ఉంది.ఇక..విశాఖ మేయర్‌గా ప్రచారంలోనూ కల్యాణి దూకుడుగానే వ్యవహరించారు.అన్ని వర్గాల్లోకి వెళ్లి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.అయితే,ఈ ప్రచార సమయంలో కల్యాణి సోషల్ మీడియా టీం మాత్రం విమర్శలకు అవకాశం ఇచ్చేలా రీల్స్ తయారు చేసిందనే అభిప్రాయం ఉంది.కీలకమైన మేయర్ ఎన్నికల్లో వరుదు కల్యాణి ప్రచారాన్ని కేవలం స్లో-మోషన్ షాట్లు,డ్రమాటిక్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లు,సినిమాటిక్ రీల్స్‌కు మాత్రమే పరిమితం చేసింది.ప్రజలకు సూటిగా చెప్పాల్సిన అంశాలు,ప్రభుత్వ వైఫల్యాలు,మేనిఫెస్టో లక్ష్యాలను వీడియోల్లో వివరించకుండా..కేవలం ఫోటోషూట్ల మాదిరిగా ప్రచారం సాగించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

ప్రచారంతో పెరిగిన అంచనాలు.. అయినా
విశాఖ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిలదీత ఈ ఎన్నికల్లో కల్యాణికి అదనపు బలంగా కనిపించింది.అయితే,ఆమె సోషల్ మీడియా బృందం ఆ బలాలను ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయిందనే అభిప్రాయం వినిపిస్తోంది.కూటమి ప్రభుత్వాన్ని కౌన్సిల్లో ఎలాగైతే ఇరుకున పెట్టారో..అదే తరహాలో వార్డుల్లోని సమస్యలను ఎత్తి చూపుతూ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో విఫలమయ్యారు.ప్రజలకు అవసరమైన విధానపరమైన చర్చను పక్కనపెట్టి,కేవలం రీల్స్ వ్యూస్ కోసమే ప్రయత్నించినట్లుగా వారి తీరు కనిపించింది.దీంతో విశాఖ నగరంలోని విద్యావంతులు,యువ ఓటర్లలోకి కల్యాణి వాయిస్ పూర్తిస్థాయిలో వెళ్లలేకపోయిందనే అభిప్రాయం పార్టీ నేతల్లో వినిపిస్తోంది.
వార్డు వార్డునా పాదయాత్రలు చేస్తున్నప్పటికీ..దాన్ని సరైన రీతిలో డిజిటల్ మీడియాలో ప్రొజెక్ట్ చేయలేకపోవడంతో క్షేత్రస్థాయి శ్రమకు తగ్గ ఫలితం కనిపించలేదని కార్యకర్తలు వాపోతున్నారు.సోషల్ మీడియా టీమ్ తప్పిదాల వల్ల డిజిటల్ ప్రచారంలో వెనకబడ్డారని పార్టీ ప్రధాన కార్యలయానికి సమాచారం అందుతోంది.కాగా,వరుదు కల్యాణి ప్రచారం తీరు..ప్రజా మద్దతు ఎంత వరకు మేయర్ పీఠం కట్టబెడుతుంది అనేది పోలింగ్..ఫలితాల్లో స్పష్టం కానుంది.













Click it and Unblock the Notifications
