వైఎస్ షర్మిల జగన్ ల మధ్య అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్న విజయమ్మ!!
సహజంగా ఎక్కడైనా ఇంట్లో ఉన్న అన్నా చెల్లెలు ఇద్దరు కలిసికట్టుగా ఉండాలని, ఐకమత్యంతో జీవించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా నిలబడాలని తల్లి ఆశిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఉన్న తాజా పరిస్థితులు, రాజకీయంగా కుటుంబంలో చోటు చేసుకున్న వివాదాలు విజయమ్మకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా అన్నాచెల్లెళ్ల మధ్య పంచాయతీ రోడ్డెక్కితే అడకత్తెరలో పోక చెక్కలా విజయమ్మ నలిగిపోతున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైయస్ జగన్, షర్మిల ను రాజకీయంగా ఏకతాటి మీద నడిపించే ప్రయత్నం చేశారు వైయస్ విజయమ్మ. 2019 ఎన్నికలలో ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి అటు విజయమ్మ, ఇటు వైఎస్ షర్మిల వైయస్ జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారు.

ఫలితంగా ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత పరిణామాలలో వైయస్ షర్మిలకు, వైయస్ జగన్ కు మధ్య రాజకీయ విభేదాలు చోటు చేసుకోవడంతో, వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించి రాజకీయాలను మొదలుపెట్టారు. ఏపీలో సీఎంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించడంతో, కుమార్తె కు వైఎస్ విజయమ్మ అండగా నిలబడ్డారు.
తెలంగాణలో రాజకీయాలు చేసిన సమయంలో ఎక్కడ వైయస్ జగన్మోహన్ రెడ్డి టాపిక్ రాకుండా, ఒకవేళ ఎప్పుడైనా షర్మిల మాట్లాడినా వారిస్తూ, అడుగడుగునా పక్కనే ఉంటూ చాలా జాగ్రత్తగా ఈ వ్యవహారాన్ని వైయస్ విజయమ్మ డీల్ చేశారు. తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఇక అనూహ్యంగా ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు అప్పగించడంతో ఏపీలో అడుగుపెట్టిన షర్మిల అన్న జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. జగన్ కూడా షర్మిల పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ప్రచ్చన్న యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. పదవి ఇవ్వకపోతేనే షర్మిల జగన్ విభేదిస్తున్నదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తాను జగన్ సీఎం అయిన తర్వాత ఏమీ అడగలేదని దీనికి సాక్ష్యం మా అమ్మ విజయమ్మే అని షర్మిల తాజాగా పేర్కొన్నారు.
తాను చెప్పింది తప్పని దమ్ముంటే వైసిపి నేతలు మా అమ్మ విజయమ్మతో చెప్పించాలని సవాల్ విసిరారు. ఇక ఇప్పటికే ఇద్దరు బిడ్డల మధ్య నలిగిపోతున్న విజయమ్మ ముందు ముందు ఈ వివాదం ఎక్కడ వరకు వెళుతుందోనని ఆందోళన పడుతున్నారని సమాచారం. ఎవరూ తగ్గకపోవటంతో ఆమె తీవ్ర వేదనకు గురవుతున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications