ఏపీలోనూ 50 శాతం ఉద్యోగ కోటా?-కర్నాటక మోడల్- సంచలన డిమాండ్..!
ఆంధ్రప్రదేశ్ లో పరివర్తన రాజనీతి పార్టీ (PRP)ని స్దాపించి జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. (Vijayasai Reddy) పలు సామాజిక, ఆర్ధిక, ఇతర అంశాలపై నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వానికి ఆయన ఓ కీలక సూచన చేశారు. కర్నాటకలో విజయవంతంగా అమలు చేస్తున్న ఓ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లోనూ అమలు చేయాలని సాయిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
కర్నాటకలో ప్రస్తుతం స్థానికులకు పరిశ్రమల్లో 50 ఉద్యోగాలు కేటాయించే విధానం అమలు చేస్తున్నారు. దీన్ని ఏపీలోనూ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విజయసాయిరెడ్డి ఇవాళ ఎక్స్ లో ఓ ట్వీట్ పెట్టారు. కర్ణాటక రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళజాతి సంస్థల్లో స్థానిక ప్రతిభావంతులకు ప్రాధాన్యత కల్పిస్తున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఎందుకు అలా చేయకూడదని ఆయన ప్రశ్నించారు. కొత్త పరిశ్రమల్లో కనీసం 50 శాతం ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్థానికులకే దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి కోరారు.

భూమి, నీరు వంటి ప్రభుత్వ వనరులను పరిశ్రమలకు కేటాయించినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలే నేరుగా లబ్ధి పొందాలని విజయసాయిరెడ్డి తెలిపారు. పారిశ్రామిక వృద్ధి అనేది స్థానిక ఉపాధి కల్పనకు, తద్వారా స్థానిక ప్రజల ఆర్థిక శ్రేయస్సుకు దారితీయాలని ఆయన ప్రభుత్వానికి గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ లో గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల్లో 70 శాతం ఉద్యోగాల్ని స్థానికులకు కేటాయించే విధానం అమల్లోకి తెచ్చారు. కానీ ఇది పూర్తిగా అమలు కాలేదు. ఆ లోపే ప్రభుత్వం మారడంతో ఆ విధానం అటకెక్కింది. ఇప్పుడు విశాఖలో పలు మల్టీ నేషనల్ కంపెనీలు ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో అక్కడ స్థానికులకు కనీసం సగం ఉద్యోగాలు కేటాయించే కర్నాటక మోడల్ అవసరాన్ని సాయిరెడ్డి గుర్తుచేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.














Click it and Unblock the Notifications
