Visakhapatnam North Assembly Election 2024 Results LIVE: రాజుల పోరులో గెలుపెవరిది ?
విశాఖపట్నం ఉత్తర అసెంబ్లీ ఎన్నికల 2024 ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం: విశాఖపట్నం ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ప్రధాన పోటీ వైసీపీ, బీజేపీ అభ్యర్ధుల మధ్యే జరిగింది. వైసీపీ తరఫున కమ్మిలి కన్నప్ప రాజు (కేకే రాజు), బీజేపీ తరఫున విష్ణుకుమార్ రాజు బరిలోకి దిగారు. రాష్ట్రంలో వైసీపీ, కూటమి మధ్య జరిగిన పోరు తరహాలోనే ఇక్కడ కూడా ముఖాముఖీ పోరు జరిగింది. ఇందులో ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..
విశాఖపట్నం సిటీ అర్బన్ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో ఒకటైన ఉత్తర అసెంబ్లీ సీటులో విద్యావంతుల ప్రభావం ఎక్కువే. ఇక్కడ 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణుకుమార్ రాజు గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మరోసారి ఇక్కడి నుంచి ఆయన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఆయనకు గత ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగి ఓటమి పాలైన వైసీపీ అభ్యర్ధి కేకే రాజు నుంచి ఈసారి గట్టిపోటీ లభించింది. దీనికి కారణం వైసీపీ విశాఖ రాజధానిపై చేసిన ప్రయత్నాలతో పాటు గత ఎన్నికల్లో ఓటమిపాలైన సానుభూతి కూడా ఉంది. అయితే ఈసారి పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్ధులు గత ఎన్నికల్లో ఓడిపోయిన వారే.

కూటమి మద్దతుతో బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్ధి విష్ణుకుమార్ రాజుకు నగరంలో అర్బన్ ఓటర్లు అండగా నిలిచినట్లు పోలింగ్ సరళి బట్టి అర్థమవుతోంది. అధికార వైసీపీ ప్రభుత్వంపై విశాఖ నగరంలో ఉన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. అటు వైసీపీ అభ్యర్ధి కేకే రాజు గత ఐదేళ్లుగా ప్రజల్లో మమేకమై పనిచేసిన తనకు వారే అండగా నిలుస్తారన్న ధీమా ఉంది. ముఖ్యంగా కరోనా సమయంలో ప్రజలకు వ్యక్తిగతంగా అండగా నిలిచిన తీరు ఆయనకు మైలేజ్ ఇచ్చింది. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కేకే రాజుకు కలిసొస్తుండగా.. విష్ణుకుమార్ రాజు సీనియర్ నేత కావడంతో గట్టి పోటీ జరిగింది.
విశాఖ ఉత్తరం సీటులో వైసీపీ అభ్యర్ధి కేకే రాజుకు గెలుపు అవకాశాలున్నట్లు నగరంలో అత్యధికులు అభిప్రాయపడుతున్నారు. అయితే కూటమి గాలి బలంగా వీస్తే మాత్రం విష్ణుకుమార్ రాజు మరోసారి గెలుస్తారనే అంచనాలున్నాయి. అయితే విజేత ఎవరైనా భారీ మెజార్టీలు మాత్రం లభించే అవకాశాలు లేవు. అభ్యర్ధులు ఇద్దరిపైనా ప్రత్యేకంగా నెగెటివిటీ లేకపోవడంతో ఈసారి విశాఖ ఉత్తరంలో గెలుపుపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications