తిరుపతి శ్రీవారి దర్శనం కోసం IRCTC అదిరిపోయే ప్యాకేజ్
తిరుమల గిరులపై కొలువైన ఏడుకొండలవాడిని దర్శించుకోవాలనుకునేవారికి ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ IRCTC ఒక శుభవార్త వినిపించింది. విశాఖపట్నం నుంచి వీకెండ్ లో తిరుమల దర్శన్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ప్రతి శుక్రవారం ఇది అందుబాటులో ఉండనుంది. శ్రీవారి దర్శనంతోపాటు శ్రీనివాస మంగాపురం, తిరుచానూర్, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించుకోవచ్చు.
వెంకటేశ్వరస్వామివారి దర్శనానికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ఈ ప్యాకేజీలో కలిపే ఉండటం విశేషం. వీకెండ్ లో స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవాలనుకునేవారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ప్రతి శుక్రవారం విశాఖపట్నంలో మధ్యాహ్నం 2.00 గంటలకు తిరుమల ఎక్స్ ప్రెస్ ఎక్కడంతో యాత్ర ప్రారంభమవుతుంది. తర్వాతరోజు ఉదయం 4.05 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు.

హోటల్‌లో రెడీ అయిన తర్వాత కాణిపాకం, శ్రీనివాస మంగాపురంలోని ఆలయాలను సందర్శిస్తారు. అదేరోజు రాత్రికి తిరుపతిలో బస ఉంటుంది. మూడోరోజు ఉదయం శ్రీకాళహస్తి, తిరుచానూరు వెళతారు. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. స్పెషల్ ఎంట్రీ దర్శనంద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. అనంతరం తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రి 8.30 గంటలకు తిరుపతి రైల్వేస్టేషన్ లో రైలు ఎక్కితే తెల్లవారి 11.30 గంటలకు వైజాగ్ చేరుకుంటారు. దీంతో యాత్ర సమాప్తమవుతుంది.
కంఫర్ట్‌లో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.12,375, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.13,250, స్టాండర్డ్‌లో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.10,280, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.11,160 గా నిర్ణయించారు. కనీసం నలుగురు నుంచి ఆరుగురు వరకు బుక్ చేసుకునేవారికి ఇవి వర్తిస్తాయి. ఒకరు లేదంటే ఇద్దరు లేదంటే ముగ్గురు వరకు బుక్ చేసుకునేవారికి ప్యాకేజీ ధర కాస్తంత ఎక్కువగా ఉంది. కంఫర్ట్‌లో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.12,695, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.15,200, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.25,510, స్టాండర్డ్‌లో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.10,600, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.13,105, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.23,415 చెల్లించాలి.
కంఫర్ట్ క్లాస్‌కు థర్డ్ ఏసీ ప్రయాణం, స్టాండర్డ్ క్లాస్‌కు స్లీపర్ క్లాస్ ప్రయాణం, ఏసీ హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం, కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ ఆలయాల్లో దర్శనం టికెట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవరవుతాయి. ప్యాకేజీ బుక్ చేయడానికి https://www.irctctourism.com/ వెబ్‌సైట్ ను సందర్శించాలి.












Click it and Unblock the Notifications