రైళ్ళలో రీల్స్ చూస్తున్నారా? జరిమానా.. రైల్వే హెచ్చరిక!
రైల్వే ప్రయాణికుల ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో కృషి చేస్తోంది. రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడం, కొత్త రైల్వే లైన్లను ఏర్పాటు చేయడం, ప్రజల అవసరాలను బట్టి కొత్త రైళ్లను ఏర్పాటు చేయడం వంటి చర్యలను చేపట్టింది. ఇదే సమయంలో రైలులో ప్రయాణించే ప్రయాణికులకు సౌకర్యాలను అందించేందుకు అనేక నిబంధనలను మార్గదర్శకాలను అమలు చేస్తోంది. ఇదే సమయంలో తాజాగా రైలు ప్రయాణికుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది.
రైళ్ళలో ప్రయాణికులు పాటించాల్సిన నియమం
రైళ్లలో నిత్యం కోట్లాదిమంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇక ఇటువంటి వారికి రైలులో మెరుగైన సదుపాయాలు కల్పించడం కోసం చర్యలు చేపడుతున్న రైల్వే, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక నిర్ణయం తీసుకుంది. రాత్రి 10:00 దాటిన తర్వాత రైళ్లలో ఒక నియమాన్ని కచ్చితంగా ప్రయాణికులందరూ పాటించాలని సూచిస్తుంది. ఇండియన్ రైల్వే తాజాగా ఈ నియమాల పైన ప్రకటన చేసింది.

రాత్రి పది దాటాక ఈ నిబంధనలు అమలు
ఈ నిబంధన ప్రకారం రాత్రి 10 గంటల తర్వాత రైలులో ప్రయాణించే ప్రయాణికుల శాంతికి భంగం కలిగే విధంగా ఎవరు ప్రవర్తించకూడదు. ప్రయాణికుల శాంతికి భంగం కలిగేలా కార్యకలాపాలు రాత్రి పది తర్వాత నిషేధించబడ్డాయి. రాత్రి పది దాటిన తర్వాత ఫోన్లో బిగ్గరగా మాట్లాడడం, బయటకు పెద్ద సౌండ్ పెట్టి పాటలు చూడడం, వీడియోలు చూడడం, రీల్స్ చూడడం వంటివి ఇతర ప్రయాణికులకు ఆటంకం కలిగిస్తాయి.
నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా
కాబట్టి, ప్రయాణికులు ఎవరూ ఈ పని చేయొద్దని రైల్వే సూచిస్తుంది. ప్రతి ఒక్కరికి ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం కల్పించడమే ఈ నియమం యొక్క ప్రధాన ఉద్దేశమని రైల్వే వెల్లడిస్తోంది. ఎవరైనా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే 1989రైల్వే చట్టంలోని సెక్షన్ 145ప్రకారం నేరస్తులుగా పరిగణించి, మొదట రైల్వే అధికారులు వారికి హెచ్చరిక జారీ చేస్తారు. ఆ తర్వాత ఇదే ప్రవర్తన కొనసాగితే 500రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు జరిమానా విధించనుంది.
ఈ ఇబ్బందులు కలిగితే ప్రయాణికులు ఫిర్యాదు చెయ్యొచ్చు
ఫోన్లో బిగ్గరగా మాట్లాడినా, హెడ్ ఫోన్స్ లేకుండా పాటలు వినడం వీడియోలు చూడడం చేసినా రాత్రిపూట రైల్లో ఇతరులకు ఇబ్బంది కలిగేలా లైట్లు వేసి ఉంచినా ఇబ్బంది పడుతున్న తోటి ప్రయాణికులు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు .రైల్వే విధించిన నిబంధన పాటించని వారికి ఇప్పుడు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. కనుక ఇకపై రైళ్లలో ఇష్టారాజ్యంగా రీల్స్ చూద్దామని భావిస్తే ఫైన్ తప్పదనే విషయం గుర్తుంచుకోవాలి.












Click it and Unblock the Notifications