ఏపీలో ముందస్తు ఎన్నికలు ! వైసీపీకి ఊపిరి పోస్తాయా ? కూటమి లెక్కలేంటి ?
దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా కేంద్ర కేబినెట్ తాజాగా ఒకే దేశం-ఒకే ఎన్నికల ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. త్వరలో పార్లమెంట్ లోనూ ఈ మేరకు బిల్లు పెట్టేందుకు సిద్ధమవుతోంది. దీంతో దేశంలో మిగతా రాజకీయపార్టీలతో పాటు ఏపీలో తాజాగా ఎన్నికైన ఎన్డీయే సర్కార్ లో భాగస్వాములైన టీడీపీ, జనసేన, బీజేపీలోనూ టెన్షన్ మొదలైంది. అదే సమయంలో విపక్ష వైసీపీకి ఈ ప్రతిపాదన కాస్త ఊరటనిచ్చింది.
ఏపీలోనూ మధ్యంతర ఎన్నికలు
కేంద్రం పార్లమెంటులో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తే ఏపీలోనూ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగిపోతాయి. అయితే వచ్చే ఐదేళ్లలో ఎప్పుడైనా ఇవి జరిగే అవకాశముంది. దీంతో ఏపీలో తాజాగా ఎన్నికైన కూటమి ప్రభుత్వం పూర్తి కాలం అధికారం చెలాయించే పరిస్దితి లేదని అర్దమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో మధ్యంతర ఎన్నికలకు కూటమి పార్టీలతో పాటు విపక్ష వైసీపీ కూడా సిద్దం కావాల్సి ఉంటుంది.

ముందస్తుపై కూటమి లెక్కలేంటి ?
ఏపీలో ఈసారి కచ్చితంగా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కేంద్రం దూకుడును చూస్తే అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ భాగస్వాములుగా ఉన్న మూడు పార్టీలు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకోవాల్సిన పరిస్ధితి. అందుకే రాష్ట్రంలో వైసీపీ నుంచి జనసేనలోకి నేతల చేరికల వేగం పెరిగింది. అదే సమయంలో మధ్యంతర ఎన్నికల్లోనూ కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తాయా లేదా అన్న చర్చ కూడా ఉంది. జనసేన వేగంగా బలం పెంచుకోవడం చూస్తుంటే భవిష్యత్ లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీడీపీ మాత్రం బీజేపీతో కలిసి ప్రయాణం చేసేందుకే మొగ్గు చూపుతోంది. బీజేపీ మాత్రం టీడీపీ లేకుండా జనసేనతో కలిసి ఏదో ఒక రోజు ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చనే ధీమాలో ఉంది.
వైసీపీకి ఊపిరి పోస్తున్న కేంద్రం ?
దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు వైసీపీకి ఆయాచిత వరంగా మారబోతున్నాయి. ఎందుకంటే తాజాగా సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ .. కేంద్రం తాజా ప్రయత్నాలతో ఐదేళ్ల పాటు విపక్షంలో ఉండాల్సిన అవసరం లేదు. అయితే అదే సమయంలో ప్రజల్లో తిరిగి వేగంగా ఆదరణ పెంచుకుంటే తప్ప జమిలి ఎన్నికలు కూడా వైసీపీకి ఉపయోగపడే అవకాశం లేదు. ఏదేమైనా కేంద్రం జమిలి ఎన్నికల రూపంలో వైసీపీకి మరో ఛాన్స్ ఇచ్చినట్లవుతుంది. అందుకే ఇప్పుడు జగన్ వేగంగా పార్టీని బలోపేతం చేసుకునే పనిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications