నారా బ్రాహ్మణి టీడీపీలో కీలకం అవుతారా? మారుతున్న టీడీపీ రాజకీయం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడం, కనీసం బెయిల్ కూడా దొరకని పరిస్థితుల్లో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండడం, మరోవైపు నారా లోకేష్ ని కూడా త్వరలోనే అరెస్టు చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉండడం ఏపీలోని టిడిపి శ్రేణులను కలవరానికి గురి చేస్తున్నాయి.
ఇక ఈ సమయంలో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించేది ఎవరు అన్న చర్చ ఆసక్తికరంగా మారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవల కాలంలో, చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజకీయాలలో నోరు విప్పిన నారా బ్రాహ్మణి రాజకీయాలలో యాక్టివ్ అవుతారా? అవసరమైతే టీడీపీని ముందుకు నడిపించడంలో కీలక భూమిక పోషిస్తారా ? అన్న చర్చ ఇప్పుడు ఏపీలో జరుగుతుంది.

చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా ఎంతోమంది సంఘీభావం తెలుపుతూ రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల నేతలు, ఐటీ ఉద్యోగులు నారా బ్రాహ్మణిని కలుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో నారా బ్రాహ్మణి పార్టీ శ్రేణులను ముందుకు నడిపించడానికి తనవంతుగా పని చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
నారా భువనేశ్వరి చంద్రబాబు అరెస్టు తర్వాత మాట్లాడుతున్నప్పటికీ, చంద్రబాబు బెయిల్ పై బయటకు రాకపోవడంతో తీవ్ర మనస్థాపంతో ఉన్న నారా భువనేశ్వరికి ధైర్యం చెబుతూనే నారా బ్రాహ్మణి పార్టీ విషయాలలో కూడా చురుకుగా వ్యవహరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో అందరి ఫోకస్ నారా బ్రాహ్మణి పైనే ఉంది.

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో ఉండడం, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీలో ఉండడంతో ప్రస్తుతం పార్టీలో నారా బ్రాహ్మణి కీలకంగా మారారని చెప్పొచ్చు. ఇటీవల వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేసిన నారా బ్రాహ్మణి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో చర్చలు జరుపుతున్నారు.
తాజాగా జనసేన నాయకులు కూడా నారా బ్రాహ్మణిని కలిసి ఆమెతో చర్చించారు. ఇక ఐటి ఉద్యోగులు కూడా నారా బ్రాహ్మణిని కలిసి సంఘీభావం ప్రకటించారు. ఇక తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేశ్‌ను A14గా చేరుస్తూ ACB కోర్టులో CID అధికారులు మెమో దాఖలు చేశారు.

ఇటు స్కిల్ స్కాంలో కూడా త్వరలో నారా లోకేష్ అరెస్టు జరుగుతుంది అన్న వార్తల నేపథ్యంలో నారా బ్రాహ్మణి చుట్టూ తెలుగుదేశం పార్టీ రాజకీయం తిరుగుతుంది. పొలిటికల్ గా బ్రాహ్మణి యాక్టివ్ అయితే తెలుగుదేశం పార్టీకి జవసత్వాలు వస్తాయి అన్న భావన పలువురిలో వ్యక్తమౌతుంది.












Click it and Unblock the Notifications