ఇకపై తిరుమలలో అన్నిచోట్లా.. భక్తుల నుంచే !!
శ్రీవారి భక్తులకు అందుతోన్న సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడానికి తిరుమల తిరుపతి దేవస్థానం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో భక్తుల నుండి అభిప్రాయ సేకరణను ప్రారంభించింది. శ్రీవారి సేవకుల ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకుంటోంది. వాళ్లు ఇచ్చే ఫీడ్ బ్యాక్, వెలిబుచ్చే అభిప్రాయాలను క్రోడీకరించి తమ సేవలను మరింత మెరుగుపర్చుకోవడం, కిందిస్థాయిలో లోటుపాట్ల గురించి తెలుసుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఐవీఆర్ఎస్, వాట్సాప్ ద్వారా భక్తుల నుండి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు సేకరిస్తోంది.
ఐవీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ సర్వే..
ఈ సర్వే ద్వారా భక్తులు తిరుమల యాత్ర పూర్తి అనుభవం, అన్న ప్రసాదం, కళ్యాణ కట్ట, శ్రీవారి ఆలయం, వసతి, లగేజ్ కౌంటర్, ప్రైవేట్ హోటళ్ల ధరలపై మొత్తం 17 ప్రశ్నలపై తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు.

వాట్సాప్ ద్వారా..
తిరుమల, తిరుపతిలో అన్నిచోట్లా ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌లను మొబైల్‌తో స్కాన్ చేస్తే (వాట్సాప్ నెం: 9399399399) టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ భక్తులు తమ పేరు, విభాగం (అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూలైన్, గదులు మొదలైనవి)ను ఎంచుకోవాలి.
అభిప్రాయం తెలియజేయడానికి టెక్స్ట్ లేదా వీడియో ఫార్మాట్ ను సెలక్ట్ చేసుకోవాలి. సేవా ప్రమాణాన్ని ఉత్తమం, సగటు/మరింత మెరుగుదల అవసరం, లేదా బాగాలేదు గా రేటింగ్ ఇవ్వాలి. భక్తులు తమ అభిప్రాయాన్ని గరిష్టంగా 600 అక్షరాల పరిమితిలో టైప్ చేయవచ్చు లేదా వీడియోగా అప్‌లోడ్ చేయవచ్చు.
శ్రీవారి సేవకులు..
తిరుమల, తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై శ్రీవారి సేవకుల సహకారంతో ప్రత్యక్షంగా అభిప్రాయ సేకరణ చేయడం జరుగుతోంది. ఈ విధానంలో సేవకులు ప్రశ్నావళితో కూడిన పత్రాలను అందిస్తారు. ఇందులో భక్తులు వివరాలు నమోదు చేసి తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. వారి అభిప్రాయాలకు అనుగుణంగా తమ సేవలను మరింత మెరుగుపరచడం కోసం ఈ సర్వే ద్వారా వారి ప్రత్యక్ష అనుభవాలను సేకరించడం జరుగుతోంది.
డయల్ యువర్ ఈవో ద్వారా..
ప్రతినెలా మొదటి శుక్రవారం టీటీడీ నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమం ద్వారా టీటీడీ ఈవో స్వయంగా భక్తులతో మాట్లాడి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. భక్తులు 0877-2263261 కు కాల్ చేసి తమ అభిప్రాయాలను టీటీడీ ఈవోకు నేరుగా తెలియజేయవచ్చు. టీటీడీ ఉన్నతాధికారులకు మెయిల్ ద్వారా కూడా భక్తులు ఫీడ్ బ్యాక్ ఇవ్వొచ్చు.












Click it and Unblock the Notifications