ఏపీలో వైసీపీ-జనసేన స్టిక్కర్ వార్- మా నమ్మకం నువ్వే జగన్ వర్సెస్ మాకు నమ్మకం లేదు దొరా..!
ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ ప్రభుత్వం "మా నమ్మకం నువ్వే జగన్" పేరుతో మొదలుపెట్టిన స్టిక్కర్ ప్రచారానికి కౌంటర్ గా "మాకు నమ్మకం లేదు దొరా" పేరుతో జనసేన కౌంటర్ ఇస్తోంది.
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార, విపక్షాల మధ్య పోరు పెరుగుతోంది. జనంలోకి వెళ్లి పరస్పరం పైచేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో వైసీపీ ప్రభుత్వ బలమైన సంక్షేమాన్ని హైలెట్ చేసేలా తాజాగా అధికార పార్టీ మొదలుపెట్టిన స్టిక్కర్ ప్రచారానికి, విపక్ష జనసేన అంటే దీటుగా మరో స్టిక్కర్ తో సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో ఈ స్టిక్కర్ వార్ ఎన్నికల నాటికి మరింత తీవ్రమయ్యేలా ఉంది.

ఏపీలో స్టిక్కర్లతో నినాదాల హోరు
ఏపీలో గతంలో జరిగిన అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో పలు నినాదాలు తెరపైకి వచ్చాయి. వాటిలో ప్రజలు పలు నినాదాల్ని ఆదరించగా.. మరికొన్నింటిని నిర్ద్వందంగా తిరస్కరించారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో తెరపైకి వచ్చే నినాదాలకు జనంలో ఆదరణ బాగానే ఉంటోంది.దీంతో ఈసారి ఎన్నికలకు ఇప్పటి నుంచో ఏపీలో నినాదాలు రెడీ అయిపోతున్నాయి. ఇదే క్రమంలో అధికార వైసీపీ వైఎస్ జగన్ స్టిక్కర్ నినాదాన్ని రెడీ చేసింది. దీనికి కౌంటర్ గా జగన్ ఫొటోతోనే జనసేన కూడా మరో కౌంటర్ నినాదాన్ని ప్రిపేర్ చేసుకుంది.

వైసీపీ "మా నమ్మకం నువ్వే జగన్ "
ఏపీలో వైసీపీ ప్రభుత్వం గత మూడున్నరేళ్లలో భారీ ఎత్తున చేపట్టిన సంక్షేమాన్ని జనంలోకి తీసుకెళ్లేలా వైఎస్ జగన్ ఫోటోతో "మా నమ్మకం నువ్వే జగన్ " స్టిక్కర్ ను ఆ పార్టీ రూపొందించింది. త్వరలో సంక్షేమ పథకాలు అందుకుంటున్న వారి ఇళ్లకు ఈ స్టిక్కర్లు అంటించబోతోంది. తద్వారా జనంలో జగన్ సంక్షేమం గుర్తుండిపోతుందని, అలాగే ఈ స్టిక్కర్లను చూసిన వారికి జగన్ ఎంతమందికి లబ్ది చేకూరుస్తున్నారో కూడా తెలుస్తుందని వైసీపీ చెబుతోంది. దీంతో త్వరలో భారీ ఎత్తున లబ్దిదారుల ఇళ్లకు ఈ స్టిక్కర్లు అంటించేందుకు వైసీపీ ఏర్పాట్లు చేస్తోంది.

జనసేన "మాకు నమ్మకం లేదు దొర..!"
వైసీపీ చేపట్టిన "మా నమ్మకం నువ్వే జగన్ " స్టిక్కర్ల ప్రచారానికి కౌంటర్ ఇచ్చేందుకు జనసేన సిద్ధమైంది. ఇప్పటికే వైఎస్ జగన్ కు అప్పురత్న అవార్డు అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయగా..దానికి కొనసాగింపుగా జనసేన స్టిక్కర్ వార్ కు తెరలేపింది. సోషల్ మీడియాలో ఇప్పుడు "మాకు నమ్మకం లేదు దొర..! నిన్ను నమ్మలేం జగన్ " అంటూ జనసేన ఓ స్టిక్కర్ ను వైరల్ చేస్తోంది. ఇందులో ఓ సామాన్యుడి ఫొటో పెట్టి ఆయన జగన్ ను నమ్మలేం అంటూ చేతులెత్తి బాధపడుతున్న ఫొటోను పెట్టింది. దీంతో జనసేన కౌంటర్ స్టిక్కర్ వార్ ఆసక్తి రేపుతోంది. ఎన్నికల నాటికి టీడీపీ కూడా ఇలాంటి వార్ మొదలుపెట్టేందుకు సిద్దమవుతోందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications