YS Jagan : జగన్ ఒక్క నిర్ణయం-వైసీపీ ఎమ్మెల్యేలందరిపైనా ప్రభావం-పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్ ?
ఏపీలో కొన్ని దశాబ్దాలుగా అలవాటైన ప్రభుత్వ పాలనలో వైఎస్ జగన్ రాక పెను మార్పులు తెచ్చింది. ముఖ్యంగా సంక్షేమ పథకాల పంపిణీ విషయంలో జగన్ అనుసరిస్తున్న వైఖరి దీర్ఘకాలంలో వైసీపీకి మేలు చేస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఓ అంశం మాత్రం ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేలను చికాకుపెడుతోంది. వైసీపీ సర్కార్ అట్టహాసంగా నిర్వహిస్తున్న గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. ఇది అంతిమంగా పార్టీ విజయావకాశాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న దానిపై పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది.

జగన్ మార్క్ పాలన
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు దాటిపోయింది. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయి. ఇందులో జగన్ సత్తా ఏంటో ప్రజలు నిర్ణయించబోతున్నారు. విపక్షాలు మాత్రం యథాలాపంగా ప్రతీ అంశంపై విమర్శలు చేస్తూనే ఉన్నాయి. వీటిపై ప్రజలు ఏమనుకుంటున్నారనే దానిపై ఇప్పటికే జగన్ పలు సర్వేలు చేయిస్తూనే ఉన్నారు. అన్నింటికీ మించి ఓ నిర్ణయాన్ని మాత్రం జగన్ అమలు చేస్తున్న తీరు వైసీపీ ఎమ్మెల్యేల్ని కలవరపెడుతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు గడప గడపలోనూ దానిపైనే చర్చ జరుగుతోంది.

జగన్ బటన్ క్లిక్
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత ప్రభుత్వాలకు భిన్నంగా సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసు నుంచే మూడేళ్లుగా వందలసార్లు బటన్ క్లిక్ చేసి సంక్షేమ పథకాల మొత్తాల్ని లబ్దిదారులకు విడుదల చేశారు. ఈ మొత్తాలు నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లాయి. తద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పోయింది. లబ్దిదారులు ఆఫీసుల చుట్టూ తిరిగే పని తగ్గింది. అలాగే వీటి కోసం లంచాలు సమర్పించుకోవాల్సిన అగత్యం తప్పింది. దీంతో ప్రభుత్వం కూడా డీబీటీ(ప్రత్యక్ష ప్రయోజన బదిలీ) భారీ ఎత్తున చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోంది. ఇక్కడే ఓ సమస్య ఎదురవుతోంది.

మధ్యవర్తులే కాదు ఎమ్మెల్యేలూ అవుట్
వైసీపీ ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకాల లబ్దిదారులకు నేరుగా డబ్బులు బ్యాంకు ఖాతాల్లోకి చేరుతుండటం, వాటిలో మధ్యవర్తుల ప్రమేయం లేకపోవడంతో ప్రభుత్వ పెద్దలు సంతోషంగా ఉన్నారు. అయితే మధ్యవర్తులే కాదు మధ్యలో ఉన్న ఎమ్మెల్యేలకు కనీస ప్రమేయం లేకుండా పోతుండటంతో జనంలో వారిపై నమ్మకం సడలిపోతోంది. గతంలో ఇవే పథకాలు రావాలంటే ఎమ్మెల్యేల ప్రమేయం, వారి అనుగ్రహం ఉండక తప్పని పరిస్ధితి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ అవకాశం లేకుండా చేసేసింది. దీంతో ఎమ్మెల్యేలు తమ ప్రమేయం లేకుండా జగన్ నేరుగా బటన్ నొక్కేస్తుంటే ఇక తామెందుకనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతనెలలో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఇదే అంశాన్ని బహిరంగంగానే ప్రస్తావించారు. నిన్న ఇదే జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే, జగన్ బంధువు కూడా అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం ఇదే అంశాన్ని గుర్తుచేశారు.

జగన్ టార్గెట్ అదే ?
రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసే క్రమంలో సీఎం జగన్ నేరుగా బటన్ నొక్కి డబ్బుల్ని లబ్దిదారుల ఖాతాల్లో వేస్తుంటే తామేం చేయాలనేది వైసీపీ ఎమ్మెల్యేల నుంచి వినిపిస్తున్న మాట. అయితే వైఎస్ జగన్ మాత్రం లబ్దిదారులకు లబ్ది జరిగితే ఓట్లు వాటంతట అవే వస్తాయనే ఎమ్మెల్యేలకు పదే పదే చెప్తున్నారు. అయితే సంప్రదాయ రాజకీయాలకు అలవాటు పడిన ఎమ్మెల్యేలు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో ప్రజల్లో తాము ఆదరణ ఎలా పెంచుకోవాలని ప్రశ్నిస్తున్నారు. కానీ జగన్ మాత్రం దూరాలోచనతోనే ఈ ప్లాన్ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ప్రభావం ప్రభుత్వంపై పడకుండా ఉండేందుకే ఈ విధానం అమలు చేస్తున్నట్లు అర్ధమవుతోంది. తద్వారా తేడా వస్తే ఎమ్మెల్యేలను మార్చుకుంటే సరిపోతుందనేది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది.