చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖిని తలుపు తట్టి లేపటమే.. వైఎస్ జగన్
మరో 10 రోజులలో ఎన్నికల కురుక్షేత్ర యుద్ధం జరగనుందని ఈ యుద్ధంలో వైసీపీని గెలిపించాలన్నారు. ఈ ఎన్నికలలో చంద్రబాబుకు ఓటు వేస్తే కొండ చిలువ నోట్లో తల పెట్టినట్టే అన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు పలికినట్టే అన్నారు సీఎం జగన్, నేడు నరసాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగన్ చంద్రబాబు కూటమిని ఓడించాలన్నారు.
రాబోయే ఐదేళ్ళలో పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు
ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ళలో పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలన్నారు. జగన్ కు ఓటు వేస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, చంద్రబాబుకు ఓటేస్తే మాత్రం పథకాలు రద్దు అవుతాయని అన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రముఖిని తలుపు తట్టి లేపటమే అని అన్నారు. ఇప్పటివరకు చంద్రబాబు ప్రజల కోసం చేసిన ఒక్క మంచి పని చెప్పమన్నారు.

ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తారంట.. నమ్ముతారా?
14ఏళ్ళు సీఎంగా పని చేసిన చంద్రబాబు హిస్టరీలో ఒక మంచి పని చేశారా? చెప్పాలన్నారు. చంద్రబాబు పేరుచెప్తే పేదలకు ఆయన అందించిన ఒక్క స్కీం అయినా గుర్తొస్తుందా అన్నారు. రాష్ట్రంలో జరుగుతుంది కులాల మధ్య యుద్ధం కాదన్న జగన్ రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతుందన్నారు. కొత్త కొత్త మోసాలతో కూటమి ఎన్నికల్లో వస్తుందని ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తారంట .. మీరు నమ్ముతారా అని జగన్ ప్రశ్నించారు.
నిరుపేదలకు, పేద కుటుంబాల విద్యార్థులకు మీ జగన్ చేసిందిదే
తన పాలనలో నిరుపేదలకు, పేద కుటుంబాల విద్యార్థులకు ఎంతో చేశానని అన్నారు. అవ్వా తాతలకు ఇంటికే మూడు వేల రూపాయల పెన్షన్, రాష్ట్రంలో 93 శాతం పిల్లలకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్, ప్రభుత్వ స్కూళ్ళలో ఆరవ తరగతి నుంచి డిజిటల్ క్లాస్ రూములు, ఇంగ్లిష్ మీడియం బైజూస్ కంటెంట్, ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులకు బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నామన్నారు.
రెండు బటన్లు ఆలోచించి నొక్కాలన్న జగన్
గ్రామ సచివాలయాలు ద్వారా గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చామని, నేరుగా పేదల ఖాతాలోనే 2 లక్షల 70వేల కోట్ల రూపాయలు డిబిటి ద్వారా ఇచ్చామని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 2లక్షల 31వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. వాలంటీర్ల సేవలు కొనసాగాలంటే రెండు బటన్లు ఫ్యాన్ పై నొక్కాలని, పేదవాడి భవిష్యత్ కోసం లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications