దీక్ష వాయిదాపై విస్మయం: జగన్ నష్టనివారణ చర్యలు
హైదరాబాద్: ప్రభుత్వం అనుమతి నిరాకరించినా సరే తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో దీక్ష చేపడుతారంటూ ప్రకటించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వాయిదాతో నీరసపడినట్లు కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఈ నెల 26వ తేదీన ఆయన నిరవధిక నిరాహార దీక్షను తలపెట్టారు. అయితే, పోలీసులు అనుమతి నిరాకరించడంతో అది వాయిదా పడింది.
దానికితోడు, దీక్ష కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరిస్తూ సాధారణ రీతిలో హైకోర్టులో అపీల్ చేసుకోవాలని చెప్పారు. దీన్ని ఆసరా చేసుకుని జగన్ దీక్షను వాయిదా వేసుకున్నారు. పైగా, జగన్ దీక్షపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చనిపోతామంటే దీక్షకు ఎలా అనుమతిస్తామని, జగన్ దీక్షకు అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు.

దాన్ని ఆసరా చేసుకుని పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన జగన్ కోర్టు పేరుతో వెనక్కి తగ్గారు. మరోవైపు, ఈనాడు దినపత్రిక అధిపతి రామోజీరావును కలిసిన తర్వాత ఆయన మెతకబడ్డారనే మాట కూడా వినిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో జరిగిన రాజకీయ నష్టాన్ని ఆయన పూడ్చుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్లు అర్థమవుతోంది.
ఏ మాత్రం ప్రతిఘటన లేకుండా వైయస్ జగన్ తన నిరవధిక నిరాహార దీక్ష నుంచి వెనక్కి తగ్గడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. గత సంఘటనలను పరిశీలిస్తే ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రభుత్వం లేదా పోలీసులు అనుమతి నిరాకరిస్తే వెనక్కి తగ్గిన సూచనలు కనిపించలేదు. దీక్షకు సిద్ధపడి అరెస్టయిన సంఘటనలే ఎక్కువ. తద్వారా పార్టీ క్యాడర్‌లో విశ్వాసాన్ని నింపే పనిని నాయకుడు చేపడుతాడు. కానీ జగన్ ఏ మాత్రం అందుకు సిద్ధపడకపోవడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేసిందని అంటున్నారు.
ఈ స్థితిలో వైయస్ జగన్ అక్టోబర్ 6 లేదా 7 తేదీల్లో నిరవధిక నిరాహార దీక్ష చేపడుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ తాత్కాలికంగా మాత్రమే దీక్షను వాయిదా వేసుకున్నారని చెబుతున్నాయి. జగన్ దీక్షపై ఒకటి, రెండు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించారు. సోమవారం జగన్ దీక్షపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. హైకోర్టు నిర్ణయాన్ని బట్టి జగన్ దీక్షపై పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications