సీఎం పదవిపై షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు-పొలిటికల్ జర్నీపైనా కామెంట్స్..!
ఇవాళ విజయవాడలో జరిగిన ఏపీసీసీ కార్యవర్గ సమావేశంలో పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. తన పొలిటికల్ జర్నీ నుంచి మొదలుపెట్టి ఇప్పటివరకూ తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ టార్గెట్, రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేందుకు చేయాల్సిన ప్రయత్నాలు ఇలా ప్రతీ అంశంపై క్యాడర్ కు క్లారిటీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా పనిచేయాలని వారికి దిశానిర్దేశం చేశారు.
తాను రాజకీయాల్లో అడుగు పెడతానని ఏ రోజు అనుకోలేదని షర్మిల తెలిపారు. కానీ పరిస్థితులు ఈ రోజుకి తీసుకొచ్చాయన్నారు.గతంలో తన తండ్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రెడ్డి కాంగ్రెస్ ను విలీనం చేశాడని, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయ్యాడని గుర్తుచేసుకున్నారు. తాను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశానన్నారు. విలీనం సమయంలో తాను రాజ్యసభ తీసుకొని ఉండొచ్చని, లేదా ఇంకా ఏమైనా పదవి తీసుకొని ఉండొచ్చని కానీ తనకు తెలంగాణలో ఆ అవసరం లేదన్నారు.

కాంగ్రెస్ ను అధికారంలో తేవడానికి తెలంగాణలో తమ పోరాటం అప్పుడు కీలకమని, ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సి ఉందని షర్మిల తెలిపారు. తన అవసరం ఇక్కడే ఉందని తెలిపారు. అందుకే పార్టీ ఇచ్చిన భాద్యతలు చేపట్టినట్లు వివరించారు. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలని, వైఎస్ఆర్ కోరిక ఇదేనని గుర్తుచేశారు. తనకు సీఎం కావాలన్న కోరిక లేదని షర్మిల తెలిపారు. తన కోరిక కన్నా రాహుల్ ప్రధాని అవ్వాలనేది తన లక్ష్యమన్నారు. రాహుల్ ప్రధాని అయితేనే మనకు ప్రత్యేక హోదా వస్తుందని తెలిపారు. విభజన హామీలు అన్ని నెరవేరతాయన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ అట్టడుగున ఉందని, తమ ముందు పెద్ద కొండ ఉందని షర్మిల నేతలకు గుర్తుచేశారు. ఒక్కొక్క అడుగు వేస్తే కొండ పెద్ద లెక్క కాదన్నారు. కొండనే కాదు శిఖరాన్ని ఎక్కవచ్చన్నారు. ఏ నాయకుడు అయినా ఒక్కొక్క అడుగు వేస్తే లక్ష్యాన్ని సాధిస్తాడన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి నేత పని చేయాల్సిన అవసరం ఉందని, వచ్చే ఐదేళ్లలో ఎన్నో అద్భుతాలు చేయొచ్చని తెలిపారు. తమ ముందు రెండు లక్ష్యాలు ఉన్నాయని, ఒకటి పార్టీ బలోపేతం, రెండోది రాజకీయంగా నిలబడాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మనుగడ ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం తామేనని, బాబు,జగన్,పవన్ బీజేపీ కి గులాం గిరీ చేస్తున్నారని షర్మిల తెలిపారు.












Click it and Unblock the Notifications