వివేకా కేసులో మరో కీలక పరిణామం-దస్తగిరి క్షమాభిక్ష రద్దును సుప్రీంలో వ్యతిరేకించిన సునీత..
ఏపీలో రాజకీయంగా సంచలనాలకు కారణమవుతున్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కీలక నిందితుల్ని ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపిన సీబీఐ.. మిగిలిన నిందితుల కోసం వేట కొనసాగిస్తోంది. ఈ తరుణంలో ఇప్పటికే అరెస్టు చేసిన నిందితులు సీబీఐ నిర్ణయాలను టార్గెట్ చేస్తూ కోర్టుల్ని ఆశ్రయిస్తుండటంతో దర్యాప్తుపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో వివేకా కుమార్తె సునీత వీటిపైనా కోర్టుల్లో పోరాడుతున్నారు.
వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారి అసలు నిజాలు బయటపెట్టిన నిందితుడు దస్తగిరికి గతంలో సీబీఐ క్షమాభిక్ష పెట్టింది. దస్తగిరిని నిందితుడిగా కాకుండా అప్రూవర్ గా చూస్తూ ఆయనకు క్షమాభిక్ష పెట్టించిన సీబీఐ నిర్ణయంపై ఇతర నిందితులు మండిపడుతున్నారు. ఇదే క్రమంలో వివేకా పీఏ కృష్ణారెడ్డి దస్తగిరికి క్షమాభిక్ష రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సిద్దమవుతుండగా.. వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్ పిటిషన్ వేశారు.

దస్తగిరికి సీబీఐ కోర్టు ద్వారా ఇచ్చిన క్షమాభిక్ష రద్దు చేయాలని కోరుతూ వివేకా పీఏ కృష్ణారెడ్డి వేసిన పిటిషన్ ను వ్యతిరేకిస్తూ సునీత ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ఇప్పటికే సునీతను ప్రతీ కేసులో ఇంప్లీడ్ అయ్యేందుకు కోర్టులు అనుమతిస్తున్న నేపథ్యంలో ఆమె సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తాజా పిటిషన్ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పిటిషన్ లో కృష్ణారెడ్డి చేస్తున్న వాదనను సునీతారెడ్డి తప్పుబట్టారు. ఈ సందర్భంగా పిటిషన్లో సునీత ప్రస్తావించిన అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి.
వివేకా కేసులో నిందితుడిగా ఉన్న పీఏ కృష్ణారెడ్డి బాధితుడి ముసుగులో దస్తగిరి క్షమాభిక్ష రద్దుకు పిటిషన్ వేశారని సునీత ఆరోపించారు. గతంలో ఇదే కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇలాంటి పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు నిందితులకు అలా కోరే హక్కు లేదని తోసిపుచ్చిందన్న అంశాన్ని ఆమె గుర్తుచేశారు. వివేకా హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేసినందున తనను బాధితుడిగా గుర్తించాలని కృష్ణారెడ్డి చేసిన విజ్ఞప్తిపైనా సునీత అభ్యంతరం తెలిపారు. ఫిర్యాదు చేసినంత మాత్రాన బాధితుడు కాదని, ఈ కేసులో అసలు బాధితులు తాను, తన తల్లి సౌభాగ్యమ్మ మాత్రమేనన్నారు. దీంతో ఇప్పుడు కృష్ణారెడ్డి బాధితుడా కాదా అన్న దానిపై చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications