మళ్లీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ పై జగన్ నిర్ణయం ఇదే..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. 2029 ఎన్నికలే లక్ష్యంగా అటు కూటమి.. ఇటు వైసీపీ వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ఎన్డీఏ లో లేకపోయినా.. జగన్ కేంద్రం ప్రతి పాదిత అంశాలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పుడు జగన్ వ్యూహాలు రాజకీయంగా ఢిల్లీ స్థాయి లో కీలకంగా మారుతున్నాయి. ఇదే సమయంలో మరో సారి వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు పైన చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం తొలిగించిన వాలంటీర్ వ్యవస్థను.. జగన్ మళ్లీ అధికారం లోకి వస్తే కొనసాగిస్తారా లేదా అనే అంశం పైన వైసీపీ ముఖ్య నేత తేల్చి చెప్పారు.
2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించింది. కరోనా సమయంలో వాలంటీర్ వ్యవస్థ కీలకంగా పని చేసింది. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం పథకాల అమలు బాధ్యత వారికే అప్పగించారు. కాగా.. 2024 ఎన్నికల్లో ఓటమి తరువాత పలువురు వైసీపీ నేతలు తమ ఓటమికి వాలంటీర్ వ్యవస్థ కారణమని వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల ముందు కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూనే.. వారి పారితోషికం రూ 10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కాగా..కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వాలంటీర్ వ్యవస్థను తప్పించి.. సచివాలయ సిబ్బందితోనే సేవలు అందిస్తున్నారు. కాగా.. ఇప్పుడు మరోసారి వాలంటీర్ వ్యవస్థ పైన వైసీపీ ముఖ్య నేత చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి.

మళ్లీ అధికారంలోకి వస్తే..
గత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి వలంటీర్ వ్యవస్థే కారణమని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు. పాలనలో ప్రజాప్రతినిధులకు, నాయకులకు ఎటువంటి ప్రాధాన్యం లేకపోవడంతో ప్రజలకు దూరమై, ఓటమి చవిచూశామని చెప్పారు. వలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకు మేలు జరిగి, పార్టీకి నష్టం జరిగిందన్నారు. ఈ సమస్యను అధినేత జగన్ గుర్తించారని, మరోసారి ఇటువంటి పొరపాటు జరక్కుండా చూసుకుంటారని చెప్పారు. దీంతో.. కూటమి తరహా లోనే జగన్ వాలంటీర్ వ్యవస్థను తప్పిస్తారా.. లేక, తాను అధికారంలో ఉన్న సమయంలో అమలు చేసిన విధంగానే వీరిని కొనసాగిస్తారా అనేది ఇప్పుడు చర్చగా మారుతోంది. ఇప్పటి వరకు పార్టీ నేతలు పలువురు వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల్లో తమ ఓటమికి కారణమని చెబుతున్నా.. జగన్ మాత్రం ఏ సమావేశంలోనూ ఈ అంశం పైన స్పందించ లేదు. దీంతో.. జగన్ వాలంటీర్ వ్యవస్థ పై ఏం తేల్చబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.













Click it and Unblock the Notifications