చంద్రబాబుకు సాయిరెడ్డి కంగ్రాట్స్-44 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ-దెప్పి పొడుస్తూ..
ఏపీలో చంద్రబాబు పేరెత్తితేనే మండిపడే నేతల్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ముందు వరుసలో ఉంటారు. చంద్రబాబు ఆయన గురించి మాట్లాడకపోయినా నిత్యం ఏదో ఒక అంశంలో చంద్రబాబును వెతికి వెతికి మరీ ఉతికారేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఆయన చంద్రబాబు రాజకీయ జీవితాన్ని మరోసారి టార్గెట్ చేస్తూ ఇవాళ పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది.
చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభించి 44 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా సాయిరెడ్డి పెట్టిన ట్వీట్ లో ఓవైపు అభినందనలతో పాటు మరోవైపు సెటైర్లు కూడా ఉన్నాయి. ప్రజా జీవితంలో 44 ఏళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబు గారికి అభినందనలు అంటూ మొదలుపెట్టిన సాయిరెడ్డి ఆ తర్వాత మాత్రం తనదైన శైలిలో సెటైర్లు వేశారు. దీంతో సాయిరెడ్డి అభిమానులతో పాటు వైసీపీ ఫ్యాన్స్ కూడా ఈ ట్వీట్ ను తెగ వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబును 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ టార్గెట్ చేసే సాయిరెడ్డి ఇప్పుడు 44 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భఁగా మరికాస్త మసాలా వేసి ఈ ట్వీట్ పెట్టినట్లు అర్ధమవుతోంది.

ఇదే ట్వీట్ లో చంద్రబాబు మరో 44 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉండాలని కోరుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి తనదైన శైలిలో చురకలు అంటించారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా గల్లంతైతే ఇంట్లో కూర్చుని మనవడితో ఆడుకోవాలంటూ చంద్రబాబుకు సాయిరెడ్డి ఓ సూచన కూడా చేశారు. తద్వారా చంద్రబాబుపై తనకున్న కోపమంతా ఒక్క ట్వీట్ లోనే తీర్చేసుకోవాలన్నంత కసి ఆయనలో కనిపించింది. చంద్రబాబు ఇఫ్పటికే తీరిక సమయాల్లో తన మనవడితో ఆడుకున్న ఫొటోలు, వీడియోలు దర్శనమిస్తుంటాయి. వీటిని గుర్తు చేసేలా సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీకి మంటపుట్టించేలా ఉన్నాయి.












Click it and Unblock the Notifications