ఇంకెన్ని వింతలు చూడాలో? విపక్షాలపై వైసీపీ ఎంపీ విజయసాయి విసుర్లు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఏపీలో టీడీపీ పై నిత్యం విరుచుకుపడే వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా మళ్లీ విపక్ష పార్టీలను టార్గెట్ చేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ తీరుతో వింతలు చూస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని వింతలు చూడాల్సి వస్తుందని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా టిడిపి పై విమర్శలు గుప్పించారు.
తెలుగుదేశం పార్టీ కాలం చెల్లిన సిద్ధాంతాలను వదిలి పెట్టలేకపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. డబ్బు సంచులతో ఫిరాయింపులే కాదు, ఏదైనా చేయొచ్చన్న గుడ్డి నమ్మకంతో తెలుగుదేశం పార్టీ ఉందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సాధ్యంకాని తాయిలాలతో చివరకు ప్రజలను కూడా మోసం చేయొచ్చని టిడిపి భావిస్తోందన్నారు. కాలం మారిందనే వాస్తవాన్ని అర్థం చేసుకోలేకనే ఇదంతా అంటూ సాయి రెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఆరునెలల్లో ఎన్ని వింతలు చూడాలో అంటూ సెటైర్లు వేశారు.

అంతేకాదు ప్రవాస ఆంధ్రుల్లా అప్పుడప్పుడు ఏపీ రాష్ట్రానికి వచ్చి విషం చిమ్మి పోతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. విపక్ష నేతలు ఉండేది పక్క రాష్ట్రంలో.. వాళ్ల వ్యాపార హెడ్ క్వార్టర్స్ అక్కడే అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి పన్నులు చెల్లించేది అక్కడి ప్రభుత్వానికే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విపక్ష నేతలు తరచూ కలుసుకుంటూ విందులు చేసుకుంటారన్నారు. రాష్ట్ర ప్రజలపై వారికే మాత్రం ప్రేమ లేదని సాయి రెడ్డి పేర్కొన్నారు. ప్రవాసాంద్రుల్లా అప్పుడప్పుడు వచ్చి పాలకపక్షంపైన, ప్రజలపైన, చిరుద్యోగులపైనా విషం గుమ్మరించి వెళ్తుంటారని విజయ సాయి రెడ్డి పరోక్షంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. మరొక పోస్టులో విజయసాయిరెడ్డి ఏపీలో మద్యం ధరల పెరుగుదల పైన చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేశారు.
మద్యం ధరలు పెరిగి మందుబాబులు ఇబ్బంది పడుతున్నారని ఒకటే సానుభూతి ఒలకబోస్తున్నారు బాబుగారు అంటూ ఎద్దేవా చేసిన విజయసాయిరెడ్డి, రేట్లు తగ్గించాలని ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలట.. అని చంద్రబాబు వ్యాఖ్యలను టార్గెట్ చేశారు. 14 ఏళ్లు సిఎంగా చేసిన వ్యక్తి ఇలాంటి పిలుపునివ్వడాన్ని ఏమనుకోవాలి? హాయిగా ఉన్న కుటుంబాలు చెల్లాచెదురు కావాలన్నదే ఆయన కోరిక కాబోలు అంటూ సాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.












Click it and Unblock the Notifications