కోటంరెడ్డిపై వైసీపీ తాజా వ్యూహం ? లోకల్లో ఒంటరి చేసేలా ! తమ్ముడికి గాలంపై ఫైర్..
నెల్లూరులో కొరకరాని కొయ్యగా మారుతున్న రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఒంటరిని చేసేందుకు ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డిని తమవైపు తిప్పుకునేందుకు వైసీపీ వ్యూహరచన చేస్తోంది.
వైసీపీ నుంచి గెలిచి ఆ పార్టీపైనే తిరుగుబాటు చేస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని దెబ్బతీసేందుకు అధికార పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని రూరల్ ఇన్ ఛార్జ్ గా నియమించిన వైసీపీ.. ఇప్పుడు కోటంరెడ్డి కోటరీని ఆయనకు దూరం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆయనకు మద్దతిస్తున్న వారిని కేసులు, ఇతర వ్యవహారాలతో టార్గెట్ చేస్తోంది. దీనిపై కోటంరెడ్డి ఫైర్ అయ్యారు.

కోటంరెడ్డిపై వైసీపీ దూకుడు
నెల్లూరు రూరల్లో వైసీపీ తరఫున గెలిచి తాజాగా తిరుగుబాటు చేస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని దారికి తెచ్చుకునే అవకాశాలు లేకపోవడంతో ఇక ఆయన్ను టార్గెట్ చేసేందుకు అధికార పార్టీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా వైసీపీ తరఫున గెలిచి కోటంరెడ్డికి మద్దతిస్తున్న వారిపై ఫోకస్ పెట్టింది.
ఇందులో వైసీపీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావును నిన్న అరెస్టు చేయించింది. అంతే కాదు ఆయన్ను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టకుండా ఊరూరా తిప్పిన పోలీసులు చివరికి కోటంరెడ్డి ఆగ్రహంతో వెనక్కి తగ్గారు. వెంకటేశ్వరరావును 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెడతామంటూ కోటంరెడ్డికి హామీ ఇచ్చారు.

కోటంరెడ్డి తమ్ముడిపై ఫోకస్
కోటంరెడ్డిని టార్గెట్ చేసే క్రమంలో ఆయన సోదరుడు, వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గిరిధర్ రెడ్డిని తమవైపు తిప్పుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే గిరిధర్ రెడ్డితో వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే నెల్లూరు రూరల్ సీటు కోసం గిరిధర్ రెడ్డి తనను కలిసినట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. దీంతో గిరిధర్ రెడ్డికి నెల్లూరు రూరల్ సీటు ఆశ చూపించి వైసీపీలోనే కొనసాగేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గిరిధర్ రెడ్డిని ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు.

తమ్ముడిని లాక్కోలేరన్న కోటంరెడ్డి
కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని వైసీపీలోనే కొనసాగేలా చేసేందుకు అధికార పార్టీ, ముఖ్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్న ప్రయత్నాలపై శ్రీధర్ రెడ్డి మండిపడుతున్నారు. తన తమ్ముడిని లాక్కోవడం నీ తరం, నీ తండ్రి తరం కూడా కాదని సజ్జలపై కోటంరెడ్డి ఫైర్ అయ్యారు.
ఇప్పటికే పార్టీ నుంచి విభేధించడం మొదలుపెట్టాక తమ్ముడి ఫొటోతో కలిపి బ్యానర్లు వేయించుకున్న శ్రీధర్ రెడ్డి..ఇప్పుడు వైసీపీని వీడి ఆయనతో కొనసాగుతారా లేక వైసీపీలోనే ఉండిపోతారా అన్నది ఇంకా తేలలేదు.

కోటంరెడ్డిని ఒంటరి చేసే యత్నం?
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వైసీపీలో నుంచి బహిష్కరించేందుకు ఇష్టపడని అధికార పార్టీ.. ఆయనతో పాటు వెళ్లిపోతున్న వారిని మాత్రం తమవైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కోటంరెడ్డికి మద్దతుగా ఉన్న తాటివెంకటేశ్వరరావుతోపాటు మరో నేత జావెద్ ను కూడా నిన్న పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పలు కేసులు పెట్టారు.
ఇదే క్రమంలో మిగతా నేతలపైనా త్వరలో కొరడా ఝళిపించేందుకు సిద్దమవుతున్నారు. తద్వారా కోటంరెడ్డిని ఒంటరిని చేయాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. కానీ క్షేత్రస్దాయిలో నేతలతో మంచి సంబంధాలున్న కోటంరెడ్డి దీన్ని ఎలా కౌంటర్ చేయాలన్నది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications