బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్: భారత మార్కెట్లో యమహా కొత్త శకం!
యమహా మోటార్ ఇండియా భారత మార్కెట్లో తన ఉత్పత్తి శ్రేణిని విస్తరిస్తూ.. రెండు వేర్వేరు విభాగాలలో రెండు కొత్త మోటార్ సైకిళ్లను విడుదల చేసింది. అవి Yamaha FZ-Rave, Yamaha XSR 155. వీటితో పాటు కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా ఆవిష్కరించింది. కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా ఆవిష్కరించడం ద్వారా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇచ్చింది.
1. Yamaha FZ-Rave (యమహా FZ-రేవ్)
Yamaha FZ-Rave కంపెనీ ప్రముఖ FZ సిరీస్‌లో భాగం. దూకుడుగా ఉండే ఆధునిక డిజైన్‌తో వచ్చిన ఈ బైక్ ఢిల్లీలో రూ.1,17,218 (ఎక్స్-షోరూమ్) ధరతో లభిస్తుంది. ఇందులో అగ్రెసివ్ ఫుల్-ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ పొజిషన్ లైట్, కండరాల మాదిరిగా ఉండే ఫ్యూయల్ ట్యాంక్, స్లీక్ టెయిల్ సెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. FZ-Rave 149 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 7,250 rpm వద్ద 12.4 PS శక్తిని, 5,500 rpm వద్ద 13.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడిన ఈ ఇంజిన్ అధిక ఇంధన సామర్థ్యం కోసం ట్యూన్ చేయబడింది. భద్రత కోసం ఇందులో సింగిల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టంతో పాటు ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED లైటింగ్ వంటి సాంకేతికతలు ఉన్నాయి. ఈ బైక్ E20 ఇంధనానికి కూడా అనుకూలంగా ఉంటుంది.ఈ బైక్ మ్యాట్ టైటాన్, మెటాలిక్ బ్లాక్ అనే రెండు రంగులలో లభిస్తుంది.

2. Yamaha XSR 155 (యమహా-ఎక్స్ఎస్ఆర్ 155)
Yamaha XSR 155 అనేది స్టైలిష్ పర్ఫార్మెన్స్‌ను కోరుకునే రైడర్ల కోసం ప్రత్యేకంగా నియో-రెట్రో (Neo-Retro) విభాగంలో విడుదల చేయబడింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.50 లక్షలుగా ఉంది. గుండ్రని LED హెడ్‌ల్యాంప్, టియర్‌డ్రాప్-స్టైల్ ఫ్యూయల్ ట్యాంక్, ఫ్లాట్ సింగిల్-పీస్ సీటు దీనికి క్లాసిక్, ఆధునిక రెట్రో రూపాన్ని ఇస్తాయి. పనితీరు పరంగా.. ఇందులో 155 సీసీ లిక్విడ్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజిన్, యమహా అత్యాధునిక వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ (VVA) టెక్నాలజీ ఉంది. ఈ ఇంజిన్ 10,000 rpm వద్ద 18.1 bhp శక్తిని, 8,500 rpm వద్ద 14.2 Nm టార్క్‌ను అందిస్తుంది. R15, MT-15 బైక్‌లలో ఉపయోగించే డెల్టాబాక్స్ ఫ్రేమ్‌ను కలిగి ఉన్న ఈ బైక్‌లో అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ అందించారు. భద్రత కోసం డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టం, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ప్రామాణికంగా ఉన్నాయి. ఈ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350, టీవీఎస్ రోనిన్ వంటి బైక్‌లకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.
ఈ రెండు కొత్త మోడళ్ల విడుదలతో యమహా కమ్యూటర్, పర్ఫార్మెన్స్ విభాగాలలో తమ పట్టును పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బైక్‌ల ఫీచర్లు, ధరలు వినియోగదారులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications