US-India Trade Deal: బుల్ పరుగులు, రూ.12 లక్షల కోట్లు వచ్చేశాయ్
ఎన్నాళ్లుగా నిరీక్షణలో ఉన్న దేశీయ స్టాక్ మార్కెట్‌కు ఒక్కసారిగా కొత్త ఊపిరి వచ్చింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై (US-India Trade Deal) స్పష్టత రావడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం ఉప్పొంగింది. ఉదయం మార్కెట్ తెరచిన క్షణం నుంచి ముగింపు వరకు బుల్ రన్ ఆగకుండా సాగింది. ఫలితంగా సెన్సెక్స్ రెండు వేల పాయింట్లకు పైగా దూసుకెళ్లగా, నిఫ్టీ కీలకమైన 25,700 స్థాయిని దాటి నిలిచింది. మార్కెట్ మొత్తం పచ్చని వెలుగులతో మెరిసింది.
ఈ భారీ ర్యాలీతో బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ ఒక్కరోజులోనే సుమారు రూ.12 లక్షల కోట్లు పెరిగింది. మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.467.35 లక్షల కోట్లకు చేరి మదుపర్ల సంపదను కొత్త రికార్డుకు తీసుకెళ్లింది.

US-India Trade Deal ప్రకటనతో మారిన గేమ్
భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్‌కు అసలైన టానిక్‌గా మారింది. భారత్‌పై విధించిన ప్రతీకార సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నామని ఆయన వెల్లడించారు. అంతేకాదు, అమెరికా దిగుమతులపై సుంకాలను సున్నా స్థాయికి తీసుకెళ్లడం, రష్యా నుంచి చమురు దిగుమతులపై పరిమితులు విధించేందుకు భారత్ అంగీకరించిందని ట్రంప్ తెలిపారు.
ఈ ప్రకటనతో భారత ఉత్పత్తులపై ఒత్తిడి తగ్గనుందని మార్కెట్ అంచనా వేసింది. ఫలితంగా సూచీలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి.
బుల్ రన్ వివరాలు
సెన్సెక్స్ ప్రారంభంలోనే సుమారు 3,600 పాయింట్ల లాభంతో 85,323 స్థాయిలో తెరచుకుంది. ఇంట్రాడేలో 85,871 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 2,072 పాయింట్ల లాభంతో 83,739 వద్ద ముగిసింది.
నిఫ్టీ కూడా జోరు చూపిస్తూ 26,341 స్థాయిని తాకి, చివరకు 639 పాయింట్ల లాభంతో 25,727 వద్ద స్థిరపడింది.
రూపాయికి కొత్త బలం
స్టాక్ మార్కెట్‌తో పాటు రూపాయి కూడా బలపడింది. డాలర్‌తో పోలిస్తే ఒక్కరోజులోనే రూపాయి 1.36 శాతం లాభపడి 90.26 స్థాయికి చేరింది. ఇంత బలమైన రికవరీ ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి.
లాభాల్లో మెరిసిన స్టాక్స్
సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో టెక్ మహీంద్రా, బీఈఎల్ మినహా మిగిలిన అన్ని షేర్లు లాభాల్లో ముగిశాయి.
అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండిగో, పవర్‌గ్రిడ్, సన్ ఫార్మా వంటి స్టాక్స్ భారీ లాభాలు నమోదు చేశాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు సుమారు 66 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు ధర 4,921 డాలర్ల దగ్గర కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే... ట్రేడ్ డీల్ ఆశలు దేశీయ మార్కెట్‌కు మళ్లీ ప్రాణం పోశాయనే చెప్పాలి.












Click it and Unblock the Notifications