ITR ఫైలింగ్: పన్ను కట్టక్కర్లేని 10 ఆదాయాలు ఇవే..

ఆదాయపు పన్ను (Income Tax) రిటర్న్లు దాఖలు చేసేటప్పుడు చాలామంది పన్ను చెల్లింపుదారులు కేవలం డిడక్షన్స్ (మినహాయింపులు), రిబేట్లపైనే ఎక్కువ దృష్టి పెడతారు. కానీ, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం కొన్ని రకాల ఆదాయాలపై అసలు ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదు. వీటిని "ఎగ్జెంప్ట్ ఇన్‌కమ్" (Exempt Income) అంటారు. అసలు పన్ను పరిధిలోకి రాని ఈ ఆదాయాల గురించి సరైన అవగాహన లేకపోతే.. ట్యాక్స్ ప్లానింగ్‌లో మంచి అవకాశాలను కోల్పోవడమే కాకుండా, ఐటీఆర్ (ITR) ఫైలింగ్‌లో తప్పులు దొర్లే ప్రమాదం ఉంది.

ముఖ్యంగా అసెస్‌మెంట్ ఇయర్ (AY) 2026-27 ఐటీఆర్ ఫైలింగ్ విధానంలో ఈ పన్ను రహిత ఆదాయాల వివరాలను వెల్లడించడం మరింత కీలకమయింది. పన్ను కట్టాల్సిన అవసరం లేకపోయినా.. ఐటీఆర్ పోర్టల్‌లో నిర్దేశించిన కాలమ్స్ లేదా షెడ్యూల్స్‌లో ఈ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి భారత పన్ను చట్టాల ప్రకారం ట్యాక్స్ పరిధిలోకి రాని ఆ 10 రకాల ఆదాయాల వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

1. వ్యవసాయ ఆదాయం (Agricultural Income)

భారతదేశంలో ఉన్న వ్యవసాయ భూమి ద్వారా సంపాదించే ఆదాయానికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10(1) కింద పూర్తి పన్ను మినహాయింపు ఉంది. పంటల సాగు, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం, లేదా వ్యవసాయ భూమి ద్వారా వచ్చే అద్దె/కౌలు వంటివన్నీ ఈ పరిధిలోకి వస్తాయి.

Maximize Your Tax Savings Today Discover the Top Ten Completely Tax Exempt Incomes for ITR Filing 2026

2. అవిభక్త హిందూ కుటుంబం (HUF) నుంచి వచ్చే మొత్తం

ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10(2) ప్రకారం ఒక హిందూ అవిభక్త కుటుంబం (HUF) పొందే ఆదాయం నుంచి ఆ కుటుంబ సభ్యుడికి లభించే డబ్బుపై ఎలాంటి పన్ను ఉండదు. ఎందుకంటే 'HUF' అనేది ఒక ప్రత్యేక పన్ను పరిధిగా పరిగణించబడి, ఇప్పటికే పన్ను చెల్లించి ఉంటుంది కాబట్టి, ఆ మొత్తాన్ని సభ్యుల చేతుల్లో మళ్లీ పన్ను వేయరు.

3. పార్టనర్‌షిప్ సంస్థలు లేదా LLPల లాభాల వాటా

ఒక పార్టనర్‌షిప్ ఫర్మ్ లేదా లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్‌షిప్ (LLP) సంస్థలో భాగస్వామిగా ఉన్న వ్యక్తి పొందే లాభాల వాటాపై సెక్షన్ 10(2A) కింద పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే, ఈ మినహాయింపు కేవలం లాభాల వాటాకు మాత్రమే వర్తిస్తుంది; ఆ సంస్థ నుంచి భాగస్వామి పొందే జీతం (Remuneration) లేదా క్యాపిటల్ పై వచ్చే వడ్డీకి పన్ను వర్తిస్తుంది.

భార్య, పిల్లలకు గిఫ్ట్‌లు ఇచ్చినా పన్ను కట్టాల్సిందే?
భార్య, పిల్లలకు గిఫ్ట్‌లు ఇచ్చినా పన్ను కట్టాల్సిందే?

4. బహుమతులు - వారసత్వ ఆస్తులు

తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, తోబుట్టువులు వంటి నిర్దేశిత బంధువుల నుంచి లభించే బహుమతులకు (Gifts) విలువతో సంబంధం లేకుండా పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే వివాహ సందర్భంలో బంధువులు కానివారి నుంచి వచ్చే బహుమతులకు కూడా పన్ను ఉండదు. అయితే, ఇతర సందర్భాల్లో బంధువులు కానివారి నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చే బహుమతుల మొత్తం రూ. 50,000 దాటితే, ఆ పూర్తి మొత్తంపై పన్ను కట్టాలి. ఇక ఒక వ్యక్తి మరణానంతరం లభించే వారసత్వ ఆస్తులపై (Inheritance) లీగల్ హెయిర్స్‌కు ఎలాంటి పన్ను ఉండదు.

5. విద్యా స్కాలర్‌షిప్‌లు (Scholarships)

విద్యార్థుల చదువుల ఖర్చుల కోసం ప్రభుత్వాలు లేదా ఇతర సంస్థల నుంచి లభించే స్కాలర్‌షిప్‌లు, విద్యా సంబంధిత ఆర్థిక సహాయాలపై ఎలాంటి ఆదాయపు పన్ను విధించరు.

Tax: మరణించిన వారి ఐటీ రిటర్న్స్: వీలునామా లేకపోతే?
Tax: మరణించిన వారి ఐటీ రిటర్న్స్: వీలునామా లేకపోతే?

6. రిటైర్మెంట్ గ్రాట్యుటీ (Gratuity)

ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో వచ్చే గ్రాట్యుటీకి పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రైవేట్ లేదా నాన్-గవర్నమెంట్ ఉద్యోగులకు సెక్షన్ 10(10) కింద కొన్ని నిబంధనలకు లోబడి మినహాయింపు లభిస్తుంది. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ కింద వచ్చే ఉద్యోగులకు ప్రస్తుతం గరిష్టంగా రూ. 20 లక్షల వరకు గ్రాట్యుటీపై పన్ను ఉండదు.

7. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ (Leave Encashment)

పదవీ విరమణ సమయంలో ఉద్యోగులు పొందే లీవ్ శాలరీపై సెక్షన్ 10(10AA) కింద పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇది పూర్తిగా పన్ను రహితం కాగా, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు గరిష్టంగా రూ. 25 లక్షల వరకు (లైఫ్‌టైమ్ సీలింగ్) మినహాయింపు లభిస్తుంది. అయితే, ఉద్యోగంలో కొనసాగుతున్నప్పుడు లీవ్ ఎన్‌క్యాష్ చేసుకుంటే దానికి పూర్తి పన్ను కట్టాల్సి ఉంటుంది.

8. ట్యాక్స్ ఫ్రీ వడ్డీ ఆదాయం (Tax-free Interest)

ప్రభుత్వ మద్దతు ఉన్న కొన్ని పొదుపు పథకాలపై వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ మొత్తాలకు పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF) లు ఈ పరిధిలోకి వస్తాయి. అయితే నిర్ణీత కాలానికి ముందే (Premature) విత్‌డ్రా చేసుకుంటే నిబంధనల ప్రకారం పన్ను ప్రయోజనాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

9. ప్రావిడెంట్ ఫండ్ (PF) విత్‌డ్రాయల్స్

గుర్తింపు పొందిన పీఎఫ్ ఖాతాల (EPF) నుంచి కనీసం 5 సంవత్సరాల నిరంతర సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాత విత్‌డ్రా చేసే మొత్తానికి (ఉద్యోగి, యాజమాన్యం వాటాతో పాటు వడ్డీ కలిపి) పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ అనారోగ్యం, కంపెనీ మూతపడటం వంటి ఉద్యోగి నియంత్రణలో లేని కారణాల వల్ల ఐదేళ్ల లోపే ఉద్యోగం కోల్పోయి పీఎఫ్ విత్‌డ్రా చేసినా పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

10. లైఫ్ ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ సొమ్ము

లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల మెచ్యూరిటీ ద్వారా వచ్చే డబ్బు మరియు బోనస్‌లకు సెక్షన్ 10(10D) కింద కొన్ని నిబంధనలతో పన్ను మినహాయింపు ఉంటుంది. పాలసీ వార్షిక ప్రీమియం, హామీ మొత్తం (Sum Assured) లో 10 శాతానికి లోబడి ఉంటేనే ఈ మినహాయింపు లభిస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం.. ఏడాదికి రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ ప్రీమియం ఉన్న యులిప్ (ULIP) పాలసీలు, అలాగే ఏడాదికి రూ. 5 లక్షల కంటే ఎక్కువ ప్రీమియం ఉన్న ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ పాలసీల మెచ్యూరిటీ మొత్తాలపై పన్ను మినహాయింపు వర్తించదు. అయితే, పాలసీదారుడు మరణిస్తే వచ్చే 'డెత్ బెనిఫిట్' సొమ్ముకు మాత్రం ఎలాంటి ప్రీమియం పరిమితులతో సంబంధం లేకుండా పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది.

పన్ను చెల్లింపుదారులు గుర్తుంచుకోవాల్సిన విషయం

ఈ ఆదాయాలన్నీ పన్ను పరిధిలోకి రానప్పటికీ, వీటికి సంబంధించిన అర్హత ప్రమాణాలు, డాక్యుమెంట్లు మరియు నిబంధనలను ఒకసారి సరిచూసుకోవడం మంచిది. ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు ఎలాంటి తప్పులు జరగకుండా ఉండటానికి, లీగల్‌గా టాక్స్ ఆదా చేసుకోవడానికి ఈ మినహాయింపులపై పూర్తి అవగాహన పెంచుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+